ఇంటి వెనక రైల్వే స్టేషన్
మనసు చెదిరినప్పుడు
మరీ ఆనందం వచ్చినప్పుడు
మరెప్పుడైనా వెల్తుంటాను అప్పుడప్పుడు
నా రాక ఆలస్యమైనట్టు
నాపై అలిగినట్టు
ఆమూలన విసిరేసినట్టు
ఒక సిమెంటు గట్టు
కలవలేక కలిసున్న పట్టాల చుట్టాలు
కలిసి పలకరించారు
అంతలో కూతపెడుతూ కుశల ప్రశ్నలేసే
మరో మిత్రుడు రానే వచ్చాడు
ప్లాట్ ఫార్మ్ మీదున్న పదిమందిని
తనతో పాటు తీసుకెల్లాడు
ఏకాంతాన్ని నాకు వదిలేస్తూ
కదలలేక కదులుతున్న గూడ్సు బండిలా
సమయం సాగుతుంది
నా కళ్ల ముందున్న కాలి కుర్చీలో
కాళ్లు చాచి పడుకుంది చీకటి
తనతోపాటు తెచ్చుకున్న నల్ల గొంగడి పరుచుకుని
ఇంక చెసేదేమి లేక
వెలుతురు పట్టుకొచ్చే వేకువ కోసం వేచిచూసానేను
మహర్షి