Wednesday, January 8, 2014

మనిషి

                      జంతువు నుండి రూపాంతరం చెందాదట మనిషి. అలా సాద్యపడటానికి కారణం మనిషి మస్తిష్కం అని శాస్త్రీయంగా ఎన్ని సాక్ష్యాలు వున్నా, కొట్టిపారేస్తూ మనసు అని నిక్కచ్చిగా చెప్పేవారూ ఏంతోమంది. శాత్రం,విజ్ఞానం ఎన్ని దొంగ సాక్ష్యలనైన పుట్టించగలదు కాని మనిషి మనస్సాక్షికి నిజం,నిజాయితీ వేరు వేరని తెలుసు తప్ప వాటికి వ్యతిరేకాలు ఉంటాయని తెలియదు పాపం. ఇంతకీ అసలు మనిషికి,జంతువుకు వున్న తేడా ఏమిటా.! అని అరా తీస్తే మనిషి మంచిని, చెడును తెలుసుకో గలడు మంచిని ఎంచుకో గలడు. జంతువుకు ఆ తేడాలు తెలియవు. జంతువు నుండి రూపాంతరం చెందిన మనిషి ఇంకా తన జంతు లక్షణాలను వదులుకోలేదు. ఒకసారి మన మనసును మనిషితోనూ మన మస్తిష్కాన్ని జంతువుతోను పోల్చుకుంటే, మనసు సామాజిక పర్యవసానాలను దృష్టిలో వుంచుకుని నిస్వార్దమైన నిర్ణయం తీసుకోగలదు. మన మస్తిష్కమైతే స్వర్దంగా తన గురించి మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది తరువాత పర్యవసానాలు ఏమైనా పట్టించుకోదు. గతం నుండి ప్రస్తుతానికి మన చరిత్రను గ్రహిస్తే స్వర్దానికి యుద్ధం చేసిన వారిని రాక్షసులుగాను నిస్వార్దంగా యుద్ధం చేసినవారిని వీరులుగాను,నాయకులుగాను చెప్పడం జరిగింది.
               రాతి యుగం నుండి నేటి యుగం వరకు మనిషి మనిషిలానే పుడుతున్నాడు కాని, పెరిగే క్రమంలోనే కొందరు మనుషులలా, కొందరు జంతువులలా మారుతున్నారు. మనిషి ప్రతీ చర్యకు రెండు దారులు వుంటాయి. ఒకటి మనసు చూపించేది మరొకటి మన మెదడు చూపించేది.మనసు దారిని ఎంచుకున్నవాడు మనిషిగా మిగులుతున్నాడు,మెదడు దారిని ఎంచుకున్నవాడు జంతువుగా మారుతున్నాడు. జంతువుగా మారుతున్న మనిషి తన మార్పును గ్రహించకపోవడం వింతగా అనిపించినా, అది మన మస్తిష్కం చేస్తున్న మోసం. మనిషిగా వున్న మనిషి ఒక నిర్ణయం తీసుకునే సమయంలో మన మనసుకు మన మస్తిష్కానికి మద్యన(మన అంతరంగంలో) యుద్ధం జరుగుతుంది.మనసు మనలోని బలంతో పోరాడితే,మస్తిష్కం మనలోని బలహీనతలను తన బలంగా చేసుకుని పోరాడుతుంది.ఈ యుద్ధం ప్రతీ నిర్ణయానికి ప్రతీ చర్యకు జరుగుతూనే వుంటుంది. మనసు ఎన్ని సార్లు గెలిచినా మస్తిష్కాన్ని చంపదు. కాని ఒక్కసారి మస్తిష్కం గెలిచిందో మనసును చంపేస్తుంది. అలాగే మనలోని మనిషిని కుడా..
మహర్షి 

Thursday, January 2, 2014

పదకంపం

సూరీడు పోద్దేక్కగానే నిద్ర లేచి
వెచ్చటి కిరణాలు సుతారంగా పోసుకుని
అద్దం ముందు సిద్దమయ్యాను
బుజానికి సంచి,సంచిలో పుస్తకాలు సర్దుకుని
సరాసరి నడుచుకుంటూ అచ్చరాల కూడలి చేరాను
అక్కడ నుండి అక్షరతూలికతో అడుగేయాలి
ఆలోచనల పురుగులు అంతటా పాకుతున్నాయి
అటుపక్క చెట్టు మీద పూసిన
ఆశలు కనిపించాయి
ఇటుపక్క తీగలకు వేలాడుతున్న
ఆరాటాలు కనిపించాయి
ఇంకోపక్క మనసు చెట్టుకు కాసిన జ్ఞాపకాలు
ఆకతాయి కాలం రువ్విన రాళ్ల గాయాలు అగుపించాయి
ఆశలకు ఆరాటాలకు మద్యలో సన్నని దారాలతో
ఊగిసలాడే ఊహలు
ఊహల విహంగాలు చిక్కుకుపోయిన ముళ్ళపొదలు
కాలంతో కదిలిపోలేక మోడువారి
విరిగిన హృదాయాల చిహ్నాలు
అడుగు అడుగుకో అనుభవం
మలుపు మలుపుకో తలపు
ఆలోచనల్లో అలిసిపోయి
అక్షరాల్లో వెలిసిపోయి
అచేతనంగా పడిపోయాను
పండిపోయిన పదాలన్ని కుప్పల్లా మీద రాలి పడ్డాయి
పదకంపమని భయపడి పరుగుతీసి పారిపోయాను
కాగితాల కారడవిలోకి..!
మహర్షి