Tuesday, March 31, 2015

మనసె నెమలై....

వేసవి వేడిమికి మండిపోతున్న మధ్యాహ్నవేల
మార్గం మరిచి వచ్చిన మేఘమొకటీ 
మధురంగా మనసు తాకి వెళ్ళింది 
వచ్చిన వర్షానిది కాదు పొరపాటు 
వర్షానికి వరండాలో కూర్చోవడం నా అలవాటు 
కొన్ని నేల మీద పడ్డ చినుకులు 
చిన్నపిల్లలై చింది 
తుంపర్లుగా నన్ను తడుపుతున్నాయి 
వాస్తవానికి 
నన్ను కాదు చాటుగా నా మనసును 
కురుస్తున్న ప్రతీ చినుకు తోడుగా 
నీ చిరునవ్వుల్ని మోసుకొస్తున్నాయి 
నీ చిరునవ్వు చినుకులు నన్ను తాకగానే 
పువ్వులై పూస్తు నీ పరిమళాన్ని 
మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తున్నాయి 
వర్షం అలిసిపోయి వెలిసిపోయింది
నీ ఆలోచనలు కురుస్తూనే వున్నాయి
నా మనసుని తడుపుతూనే వున్నాయి 
చూస్తు చూస్తు నా మనసు
మైమరచి మయూరమై మారిపోయింది
మహర్షి    

Sunday, March 29, 2015

మొదటి క్షణం

నిన్ను చూసే ప్రతీక్షణం 
మొదటిసారే
ప్రతీ మొదటిసారి
తెలియని పాతపరిచయపు
పరిమళమే 
గుర్తులేని జ్ఞాపకమో....
జ్ఞాపకం లేని గుర్తువో... 
నా మామూలు మదిసడి
మరుపురాని మధుర గానమై
మళ్ళీ వినేలోపు మౌన రాగమై
నా తలపును మీటుతూంటుంది 
మరొసారి పాత పారిచయపు 
కొత్త మొదటి క్షణం కోసం. 
మహర్షి 

Saturday, March 21, 2015

మనసు మాట

కొన్ని సార్లు మాటలు సరిపోవు 
కొన్ని చాలా సార్లు 
అక్షరాలు అరువు తెచ్చుకున్నా 
అసంపూర్ణంగానే మిగులుతాయి
అసలు విషయం 
అంతరంగం దాటి రాదు 
మనసులోని మాటలన్నీ 
నీటి మీద నీటి రాతలైపొతాయి 
కొత్త ఆకుల నుండి పడిన 
పల్చటి పసిడి కాంతిలాంటి 
ఒక నవ్వు అకారణంగా చిగురిస్తుంది 
నా లోపలి నుండి ఏవరో
నా మదిని తట్టిన చప్పుడు 
నేను రాయని మాటలెవరో 
నా చెవిలో సన్నగా చెప్పారు 
నా తెలివికి తెలియని భాషని
నా కళ్లు సరళంగా పాటలా చదువుతున్నాయి 
నన్ను జయించిన నా మనసు 
నా మనసులోని నీకై 
మాటల పరిధి దాటి 
మౌనంగా ఓ కవిత లిఖించింది 
నీ మనసు ముందుంచింది 
ఏమీ తెలియనట్టు....
నా వెనకాల నక్కి ఎదురుచూస్తుంది... 
మహర్షి

Thursday, March 19, 2015

నువ్వు,నీ ఉనికి-నేను,నా ఊపిరి....

జీవం లేనిది వస్తువు 
జీవం ఉన్నది ప్రాణి 
నా హృదయంలోకి నువ్వు నడుచుకుంటు 
వచ్చెదాక
నేనేమిటొ అర్దమయ్యెది కాదు నాకు 
వస్తువుకు నాకు మద్యున్న తేడా
కదలికే 
అదే జీవితమనుకున్నాను
జీవస్చవానని తెలియక 
హృదయమొకటి ఉందని 
స్పందన దానికుందని 
నిన్ను చుసిన క్షణమే తెలిసింది 
గాలికి దూలికి తేడా తెలియదు 
నువ్వు వరమై 
వర్షమై వచ్చేవరకు 
నిన్నటి కంబళిపురుగుకు రేపటి ఆశ లేదు
నువ్వొచ్చెదాక 
రంగుల రెక్కలిచ్చేదాక 
హద్దు లేని సంద్రాన్ని నేను 
తీరమై 
నువ్వొచ్చి కట్టిపడేసేదాక 
నేనున్నానని నాకు తెలియదు 
ప్రాణమై 
నువొచ్చి పలకరించేదాక
నిజానికి నేనెప్పుడో పుట్టినా
నీ పరిచయంతోనే ప్రాణం పోసుకున్నానన్నది 
నిజంగా నిజం.... 
మహర్షి 

Friday, March 13, 2015

మధురక్షణాలు..

కొన్ని క్షణాలుంటాయి
ఆకాశంలొనే వున్నా అస్తమానం కనిపించని 
నక్షత్రాల్ల
పాతబడవు ప్రకాశం తగ్గవు
ఎంత పెళ్ళగించినా ఎక్కడొ ఒక 
వేరు మిగిలి 
మళ్ళీ చివురించిన ఆకుపచ్చని ఆశలా 
ఎప్పటికి వాడవు ఎన్నటికి వీడవు 
అలాంటి కొన్ని క్షణాల రాళ్లు
నా మది నదిలో విసిరిన 
కారణంగా విరిసిన 
నీ ఆలోచనల తరంగాలు 
దొంతర్లుగా నన్ను తడుతూ నెడుతునేవున్నాయి
వ్యక్తపరచలేని కొన్ని మాటలు  
మనసు నుండి రాలి తేలిపోతుంటాయి 
నీ కంటి రెపరెపల నుండి 
వీచిన అల్లితెమ్మెరలకు
గుల్మొహర్ పువ్వులలా గిరికీలు కొడుతూ
కొన్ని కలలు కురిసాయి.... మెలకువలొనే...
మహర్షి 

Thursday, March 12, 2015

ప్రాణవాయువు..

నిశ్శబ్దానికి పరాకాష్టైన నిశిలొ 
నిక్షిప్తమైన కొన్ని వెన్నెల సుమాలు
సుతారంగ నా మీద రాలిపడ్డాయి
లీలగ వాటి పరిమళం నా గుండెలోపలి
పొరల్లొ తెరలుకట్టుకుంది
ముల్లులేని గడియారాల గడియల్లొ
గోముగా గోరువెచ్చని గుసగుసలు వినిపించాయి 
మాటలు రాని నా ఆశల పాపలు 
నీకు పాటలై ఎలా వినిపించాయొ???? 
కంటి రెప్పల చాటున దాచిన
భావోద్వేగాల పోరాటాలు
ఆవిరైపోయె నా అరాటాలు
అద్దంలా ఎలా కనిపించాయొ??? 
దాదాపుగా ఆగిపోయిన గుండెని 
ఓయ్ అని నీ పిలుపుల కొక్కానికి 
నా గుండెను తగిలించుకుని 
నన్ను,నా గుండెను లాక్కెల్లిపొయావు 
మళ్ళీ జీవితంవైపు.... 
మహర్షి