Saturday, December 7, 2013

జరగని కల..

ఒకసారి వెన్నక్కి వెళ్ళిపో 
ఆనాటి నీ బాల్యంలోకి 
ఆకాశమంత నా ప్రేమను అక్కడి నుండే పరిచయం చేసేలా 
నా దోశిలిలో ఊయల కడతాను  
చెడు నీ దరికి కాదు నీ నీడ దరికి కూడా రానివ్వను 
నీ తొలకరి తోలి అడుగులు నా యదపై వేయిస్తాను 
దూళి నీ పదాన్ని అంటకుండా నా అరచేతులపై నడిపిస్తాను 
వెన్నెలను తెచ్చి వెండి గిన్నెలా కరిగించి 
గోరు ముద్దలు తినిపిస్తాను 
నీ నీరాటముకై స్వాతి చినుకుల మబ్బులు మధించి 
ముత్యాల వాన కురిపిస్తాను 
నా మది ఊయలపై నిదురిస్తున్న నీకు 
నా యదసడిని శృతి చేసి జోలపాడుతాను
నీ కాలక్షేపానికి నేనే నీ ఆటవస్తువును అవుతాను 
నువ్వు కోపంలో విసిరితే విరిగేందుకు వీలుగా 
నా హృదయాన్నిస్తాను 
విరిగిన హృదయాన్ని విరిసిన పువ్వులా 
నీ పాదాల గిలిగింత కలిగేలా నలిగి నీకు నవ్వు కలిగిస్తాను
నీ అడుగులకు లయబద్దంగా నా యదసడిని మార్చుకుంటాను 
నీ ఆత్మకధకు నేను కాగితమవుతాను 
నువ్వు లిఖించే ప్రతీ అక్షరాన్ని
గుండె నాలుగు గదులకు తాళం వేసి దాచుకుంటాను
నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతీ క్షణం చెబుతుంటాను
నీ చెవికి కాదు నీ మనసుకు వినిపించేలా
నా ప్రతీ చర్యలో నీపై నా ప్రేమను చూపిస్తుంటాను..
కాని.....!
ఇదంతా ఇలలో జరగని నా కల 
గడిచిన గతం గమనం మార్చుకోదన్నది
జ్ఞాపకాల గాయం ఎన్నటికి మాయమవ్వదన్నది 
ఎంత సత్యమో 
అనంతమైన నా ప్రేమకు నీ అనుమతి లేదన్నదీ
అంతే సత్యం
మహర్షి 

2 comments:

vemulachandra said...

"నీ అడుగులకు లయబద్దంగా నా యదసడిని మార్చుకుంటాను
నీ ఆత్మకధకు నేను కాగితమవుతాను
నువ్వు లిఖించే ప్రతీ అక్షరాన్ని
గుండె నాలుగు గదులకు తాళం వేసి దాచుకుంటాను"
"జరగని కల" కవిత చదివాను. చక్కని శైలి, స్పష్టత, చాలా బాగారాసారు.
అభినందనలు మహర్షి గారు!

Unknown said...

ధన్యవాదాలు chandra vemula garu..