Thursday, January 8, 2015

ఈకల్లేని రెక్కలు..

లేసి లెవ్వంగనె పాణంలేని పక్షుల
రెక్కలు కొట్టుకుంటాయి
రాత్రి నా తలకాయల పొదిగిన గుడ్ల్లన్నీ
తలకాయల్లేని గొర్రెంకలై పొడుస్తాయి
ఏడికొ ఎగరాలని
ఇంకేడికొ ఉరకాలని
ఏడ యాదిమర్స్తనొ అని
దినమంత కిసకిసమని
గోసొలె కూస్తనే వుంటాయి 

పాణంలేని పక్షులు
ఈకల్లేని రెక్కలు
తోకల్లేని మేకల 
మె మె లకు మొండికెక్కి 
పద పదమంట
నా పాణం మీద కూసున్నాయి 
కాళిక లెక్క నాలిక 
శాచిన సీకటి తాచు 
ఉస్స్స్స్ ఉస్స్స్స్ మన్న సప్పుడుకి 
ఉసూరుమని నా 
ఊపిరితిత్తుల అరుగులెక్కి
అరుసుకుంట కూసుంటాయి
దించలేని బరువుకు
దమ్మాడక మొద్దువారిన
మనసుని పొద్దువైపు తోసుకుంట
నడిమిట్ల ఏడ ఆగకుంట
ఇగ అట్ల పొతనే.....వుంట..  
మహర్షి

No comments: