Thursday, February 5, 2015

అడుగులు మడుగులు

సీకటి సిటుక్కు మనగానే  
మబ్బుల పక్కపొంటి
మొద్దులెక్క నిద్రపొయ్యిన సురీడు
పొద్దుపొద్దుగాలనె పొడిసిండు
గాల్ల గుండ్రని దీపంలెక్క
దీపం కొసమీద కొయిసని కొరయితోటి
సుర్రున సుర్కవెట్టి నన్నుగిట్ల లేపిండు
పన్లేని మంగలొడు పిల్లి తల కొర్గినట్టు
పడమర తొవ్వపొంటి పడిపోయెటొడు 
నల్ల తుమ్మ చెట్ల మీద పూసిన
తెల్ల పువ్వుల్ని దులిపిండు
కోపమొచ్చి పువ్వులు కొంగలై ఎగిరిపొయినై  
అప్పటిదాక నా కంటి కిటికీల మీద 
కూసున్న నిద్ర గద్దలు కూడ
జింక లెక్క ఉర్కుతున్న కాలాన్ని
పట్టుకోవాలని పరుగులెడ్తున్న జంతువులు
కాదు కాదు జనాలు
ఆకలేసి కొందరు,ఆశతోని కొందరు
ఆమాటకొస్తె 
నేనుగిట్ల ఆ మందల ఉన్నోడినే
ఉర్కి ఉరికి దస్సినోడిని
ఎన్నిసార్ల యెల్లెల్కల పడ్డనో 
పడి లేస్న.. లేసి పడ్డ
ఆగకుండ ఉర్కిన.. ఉర్కలేక ఆగిన
నేనాగిన చొట అడుగులు
అటుదిక్కు ఇటుదిక్కు 
ఎటుదిక్కు చూసినా
అడుగులు 
ఎన్కొచ్చిన దారంత
ముందుపోవాల్సిన దూరమంత
నావిగాదా అడుగులు
నా అడుగులేడ ఆగమైనయో
ఏడచూసిన మడుగులు
అడుగులు నిండిన మడుగులు
నా పుర్రెల పురుగులు పారినట్టైంది
అవి పురుగులు కావు 
నన్ను సవాల్ చేస్తున్న సందేహాలు
నన్ను బేచైన్ బేచైన్ చేస్తున్నై
ఇగ నేను పోవాలె కొత్త దారి లెంకుకుంట
లేకపోతె కట్టుకుంటా  
సవాల్లకు సమాధానాలు దొరికేదాక....
 మహర్షి 

No comments: