Tuesday, December 30, 2014

అలాగ....ఇలాగ...

చీకటి చెరువు వొడ్డున కూర్చుని
తోచుబాటు ఏమి లేక 
కొన్ని క్షణాల రాళ్ళు ఒక్కొక్కటిగా విసురుతున్నాను 
అంతలో అంతవరకు నా అలొచన్నల్లొ వున్నవు 
ఆశ్చర్యంగా ఆకాశంలో చుక్కలా మెరిసి
చెరువులో చందమామలా కనిపించావు 
రాళ్ళన్ని ఒకేసారి చెరువులోకి విసిరేసి 
నీ కాలక్షేపానికైన కాసేపు కబుర్లాడవచ్చు కదా!! 
మసక మసకగా కనిపించిన ఇసక రేనువంత ఆశని 
మనసుకి భూతధ్ధాలు తొడిగి 
అనువంత ఆశను ఆకాశమంతని నమ్మించి 
ఆక్షణం అక్కడే అలాగ.... 
ఈ క్షణం ఇక్కడ ఇలాగ... 
మహర్షి 

Wednesday, November 12, 2014

సర్వాంతర్యామి

నువ్వె 
ఆకాశమని,జాబిలివని,నిశివని,
నక్షత్రానివని,మెరుపువని,మేఘానివని 
చినుకువని,వర్షానివని,వరదవని
నదివని,సంద్రానివని,తీరానివని,
ముత్యానివని,ఉప్పెనవని,అలవని 
చివురని,లతవని,పుష్పానివని,ముల్లని
నా కంటి పాపవని,కలవని,కన్నీటివని,కలతవని 
ఎన్ని సార్లు,ఎన్ని చోట్లు,ఎన్ని మాటలు,
ఎన్ని గీతలు,ఎన్ని రాతలు
ఎన్ని మార్లు,ఎన్ని పేర్లు,ఎన్ని తీర్లు పిలిచి పిలిచి, 
పలికి పలికి, తలిచి తలిచి
పిలిచి,పలికి,తలిచి 
ఇలలొ,నా కలలొ,నా తలలొ,తలపుల్లొ,నా మదిలొ లొ లోతుల్లొ గందరగొళంలా వందల ఆలోచనలు 
అన్నీ నీవే,అంతా నీవే  
భూత,భవిష్యత్,వర్తమాన 
కాలంతొ పని లేదు 
ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం,రాత్రి 
సమయంతొ సంబంధం లేదు    
నువ్వే ప్రతీ చోట నువ్వే ప్రతీ క్షణము  
నువ్వే నా కనకము నా ప్రతీ కణకణము 
 మహర్షి

Wednesday, November 5, 2014

మౌనం

ఆకాశం విరగలేదు
చుక్కలు రాలిపడలేదు
సముద్రాలు విరుచుకుపడలేదు
భూమి బద్దలవ్వలేదు
ప్రచండమారుతాలు విజృంభించలేదు
ప్రతీరొజు లాంటిదె కదా ఈరోజు కూడ!
మరి నా ఈ మనోద్వేగాల మంటలేమిటి??
ఈ మౌనమేమిటి?? 
మహర్షి

హెల్లొ ఉన్నవా!

హెల్లొ ఉన్నవా!
హా ఉన్నాను.... ఇక్కడె ఎక్కడొ
ఈ గదిలొనె 
సమాధానం లేని ప్రశ్నలా
చిరునామ లేని ఉత్తరం లా
విసిరి పారెసిన కాగితంలా
ఇక్కడే ఎక్కడొ ఉండేఉంటాను!!! 
మహర్షి 

Saturday, November 1, 2014

ఎన్నాల్లకీ వెన్నెల!!!!

ఆవేదనల అట్టడుగున ఉన్నను
ఒక్కసరి అమాంతంగ పైకి లాగేసావు
ఆకలితొ అలమటిస్తున్న మనసుకి
ఆనందాన్ని అక్షయపాత్ర చేసిచ్చావు 
మనసు నిండిపోయింది
చీకటిపాలైన అడవిలో 
జాబిలివై వెన్నెల కురిపించావు 
వెలుగు వైపు నడిపించావు
వర్ణహీనమైన జీవితంలొ 
కుంచెవై సప్తవర్ణాలు గుప్పించావు 
ఆనందం నీ పేరని తెలుసు 
నువ్వె నా ఆనందమని తెలుసు 
కాని ఇలా నన్ను ఆదుకుంటావని తెలియదు...అచ్చం మా అమ్మలా 
మహర్షి 

పొగరాజడము

గుండె పొరల్లొ దాగిన జ్ఞాపకాలన్ని 
తెరలు తెరలుగ పొగలు కక్కిస్తుంది 
వెచ్చని ఆవిరిగా వెన్నుని తగిలి 
నరనరల్లొ నిద్దుర పోతున్న 
రక్తాన్ని రంకెలేయిస్తుంది 
వేల్ల మద్యన నలుగుతూ 
వేదాంతం పలికిస్తుంది 
తను మండుతూ మస్తిష్కానికి 
మాయా బలాన్నిస్తుంది 
కవికి కవ్యానికి మద్యన 
వారదిగా నిలుస్తుంది  
బూడిద రాలుస్తూ అక్షరాలు మలుస్తుంది 
మహా మహా ఘనులెందరో 
మాటలు రాని వేల,
మనోవేదనతొ మగ్గిపోయిన వేళ
మక్కువగా హక్కున చేర్చుక్కున్న మహమ్మారి 
అపాయమని హెచ్చరిస్తునే 
ఆస్వాదించగలవా అని అపహాస్యం చేస్తుంది...
అయ్యో పాపం అని స్వాగతించామో 
స్వ గతించామే!!!!
మహర్షి 

Sunday, October 12, 2014

అనుకుని కలిసిందొ
అనుకొకుండా కలిసిందో 
ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి
ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన 
నా జాడ తెలిసొచ్చిందో!!!???
నాకు పొద్దులేదు
నా ఆశకు హద్దు లేదు
అలలు ఆకాశన్ని తాకవు
వెన్నెల నేల మీద కురవదు 
వెన్నెల కురిసే చోట నేలుంటుంది....
మహర్షి

Monday, September 15, 2014

వనమాలి...


అర్దరాత్రి ఆకాశంలొ చీకటి   
నెమలై చిందులేస్తుంది 
మొగులు పొదల మాటున 
మబ్బు చెట్ల చాటున 
దాని పురివిప్పిన పించం లోని  
కళ్లన్నీ అక్కడక్కడా  
నక్షత్రలై మెరుస్తున్నాయి 
పిలువని చుట్టంలా వచ్చిన గాలికి 
మబ్బు చెట్ల మొగ్గలన్నీ రాలిపడ్డాయి 
రాలిపడ్డ మొగ్గలన్ని పువ్వులవుతున్నాయి  
వాటి గుబాలింపు చివరన 
కొన్ని జ్ఞాపకాల ముల్లున్నాయి 
సుతారంగ మనసుని గుచ్చుకుంటున్నాయి
విచిత్రంగా గుచ్చుకున్న ముల్లన్ని 
మల్లీ గులాబిలై నా యదలొ పూస్తున్నాయి
చుస్తుండగానే నా మది వనమైయ్యింది   
ఆ వనానికి నేను వనమాలినయ్యాను....
 మహర్షి

Friday, September 12, 2014

జీ"వి"తం

ఈ యాంత్రిక జీవనంలొ 
నేనిక నటించలేను 
వెక్కిలిగా ఎవరో చెక్కిలి గిలి చేస్తునట్లు 
ఒళ్లు సకిలించి పళ్ళు ఇకిలించి
భళ్ళు భళ్ళున ఘల్లు ఘల్లున నవ్వుతున్నాను 
స్వచ్చంగా కాకుండ 
అచ్చంగా ఏడుస్తునట్లు 
నిరాశ నిస్పృహలతొ సహజీవనం చేస్తూ! 
ఎవడొ నా జీవితాన్ని శాసిస్తున్నాడు
నెనేం చెయ్యలో నిర్ణయిస్తాడు ఒకడు 
నా నిర్ణయాన్నే నిర్ధేషించేవాడు  ఇంకోడు
ఎవడో నిర్మించుకుంటున్న కలలో 
కూలిగా పనిచేస్తున్నాను   
నా జీవితాన్ని జీతానికి జీవిస్తున్నాను.
ఇదీ నా దుర్బరమైన,నీచమైన జీవం లేని జీవితం 
కాని 
ఇది నా జీవితం కాదు 
ఇది నా కల కాదు 
నా అంతరంగం నన్ను వేదిస్తుంది 
పదే పదే ప్రశ్నిస్తుంది 
ఎక్కడ వున్నానని,ఏమైపొతున్నానని 
నేనంటు అసలు వున్నాన అని..
కలలు నాకు వున్నాయి
జీవించాలని నాకు వుంది 
"ఇది.... నా జీవితం" అని తెగేసి చెప్పాలనుకుంటాను 
అంతలొనే అనుబంధాలలో బందీనవుతాను
మొహమాటంతొ మూగబోయి నాలొ నేనే నలిగిపోతాను  
విత్తనంలేని అపార్దాల మొక్కలు ఎక్కడ 
మొలకెత్తుతాయో అని 
నా ఆశలను ఆ స్థానంలో సమాది చేసాను..!
  మహర్షి 

Thursday, July 31, 2014

దీపం

ఒక్క క్షణం వెలిగి వెంటనె ఆరిపోయింది నా అధృష్టం
వెలిగిన ఆ ఒక్క క్షణం 
నక్షత్రాల తివాచి నా దారిలొ పరిచినట్టు 
అకస్మాత్తుగా నా దారి అకాశంలోకి మళ్ళినట్టు
అనిపించింది
నేను జాబిలిని చూసాను...! చూసానా..?
అన్న అనుమానం తేరుకునెలొగానే 
నా అధృష్టం ఆవిరై పోయింది 
అంతా మసకబారి పోయింది 
మబ్బులతో కాదు మనుషులతో 
కాని ఆ ఒక్క క్షణం 
ఇంకొన్నాళ్ళు నా ఆయువు ఆరనివ్వక వెలిగించె ఆజ్యం
మహర్షి

Tuesday, July 22, 2014

నిమిషం

ఒక్క నిమిషం అన్నావు 
నీవన్న ఆ నిమిషానికై 
ఎన్నొ క్షణాలను నిషేధించాను 
నీవన్న ఆ నిమిషానికై 
ఎన్నొ గడియలను విడివిడిగా విసిరేసాను
నీవన్న ఆ నిమిషానికై
ఎన్నొ నిమిషాలు వేచి 
వేచి వెతికి చూసాను
నీవన్న ఆ నిమిషానికై 
కాలంతొ పోటీపడి ఎదురుచూసాను 
నన్ను దాటిన ప్రతీ గంటని  
మెడపట్టి వెన్నక్కి నెట్టేసాను 
నీవన్న నిమిషం రానేలేదు 
కాని 
నా కాలం కరిగిపోయింది 
కాలంతొ పాటు నా జీవితమూ.!!!!
మహర్షి

Thursday, July 10, 2014

కురిసిన జ్ఞాపకాలు

రాక రాక వచ్చిన వర్షానికి 
తడిసిన చెట్లన్ని తన్మయత్వంలొ 
ఊగసగాయి-నా మనసు కూడ
వర్షపు చినుకుల గిచ్చుళ్లకు 
ఆవిరైపొంగుతుంది మట్టి
ఆ మట్టి సోయగాల వాసనలకు 
కదలకుండ కాలప్రవాహంలో 
కొట్టుకుపొయాను నేను
నీటి ప్రవాహంలో రాలిపడ్డ ఆకులా 
నిన్ను, నీతో ఉన్న నన్ను వెతుక్కుంటూ 
నా ప్రయత్నం విఫలమైంది 
నాకు బదులుగా నువ్వు,
నీకు బదులుగా నీ 
జ్ఞాపకాలు మత్రమె కనిపించాయి 
అసంకల్పితంగా ఒక అశ్రువు రాలిపడింది 
ఊగుతున్న మనసు ఒక్కసరిగా 
నీ జ్ఞాపకాల బరువుకు
ఆగిపోయింది-వర్షం కుడా.... 
మహర్షి 

Thursday, June 5, 2014

కాగితం

నా గుండెపై నీవు రాసిన జ్ఞాపకాలన్ని
నేనొక కాగితంలొ రాసాను 
కాగితం కన్నీటిపాలై కాలిపోయింది
బూడిదై రాలిపోయింది 
పాపం నా హృదయం ఇంకా కాలుతూనే ఉంది.!!!
మహర్షి 

Tuesday, June 3, 2014

నేల రాలిన మనసు

ఒక సావకాశపు సాయంకాలాన 
ఆకాశానికి చూపులు అతికించి అచేతనమైపొయాను  
చిత్రమొ,విచిత్రమో లేక  
నా మదిలోని నీ ఉహాచిత్రమో.!
ఆకాశమంతటా నిన్ను పోలిన మేఘాలు 
ఉరుము లేదు మెరుపు మెరవలేదు కాని 
నేను నిలువెల్లా తడిసిపోయాను 
నీ జ్ఞాపకాల్లొ 
విరిచిన మనసుకు విరిగిన మనసెప్పుడూ లోకువే..!
అయినా
విరిగిన మదికి ఇంత విరహమెందుకో,విలపించుటెందుకొ.!
నేల రాలిన ఆకుకే గాయలెన్నొ,జ్ఞాపకాలెన్నొ
కొత్త చివురులు రాగానే
పాత ఆకును పాట్టించుకోదు చెట్టు..
రాలిపోయిన,వాడిపోయినా
నేల రాలిన ఆకుని నేను
నన్ను మరిచి,నా గుర్తులను సైతం చెరిపేసిన 
చెట్టు నువ్వు....
 మహర్షి

Wednesday, May 28, 2014

నేను సముద్రం

ఏన్నొ సుడిగుండాలు,ఉవ్వెత్తున ఎగిసిపడే మృత్యువలలు  
పదునెక్కిన కెరటాల కవాతులు  
యముని మహిషపు గీంకరంల  
వినపడే ఉప్పెనల రణగొన ద్వనులు 
కలిగిన సముద్రాన్ని నేను 
అయినా నిను ఎన్నాడు నొప్పించలేదు 
నీ ముందు నేను నిర్మలంగానే వున్నాను 
నిన్ను నా యదలో ముత్యంలా దాచుకున్నాను.. 
నా తలపుల కల్లోల జడి నిన్ను ఎక్కడ గాయపరుస్తుందో అని..
అనుక్షణం నా ఆలొచనల అలల  ప్రవాహన్ని అనచివేసాను..
నా మదిలొ అంతర్దానమైన ఎన్నో ఆశల తరంగాలని 
భూస్తాపితం చేసాను 
ముత్యంల దాచుకున్నాను వజ్రంలా మారి 
నా యదను ముక్కలుగా కొసావు  
చిన్న అలనైన తాకనివ్వలేదు 
నా మదిలొ సునామిని సృష్టించావు 
శూన్యం లొ వదిలేసావు

మహర్షి

Monday, May 19, 2014

ఒకడున్నాడు..

ఒకడున్నాడు
నీకు తెలియకుండ నిన్ను అమితంగ ఆరాదిస్తున్నవాడు
నీకు తెలియకుండ నీ పేరును శ్వాసగా జీవిస్తున్నవాడు
నీకు తెలియకుండ అనుక్షణం నీ నీడై నడుస్తున్నవాడు
నీకు తెలియకుండ అంతెలేనంత ప్రేమని అనిచి దాచుకుంటున్నవాడు 

నీకు తెలియకుండ ప్రతిక్షణం నీ చూపుకు పరితపిస్తున్నవాడు
పరితపిస్తూ ప్రణాలనే ప్రతిక్షణం వదులుతున్నాడు 
నీకు తెలియకుండ నీ చిరునవ్వునే లక్ష్యంగా మార్చుకున్నవాడు 
అనుక్షణాన్ని అందుకే వెచ్చిస్తున్నాడు 
నీకు తెలియకుండ నీకోసం ప్రపంచాన్ని వెలెసినవాడు 
నువ్వె తన ప్రపంచమనుకునే వెర్రివాడు
నీకు తెలియకుండ జాబిలిగా నిన్ను తలచి,నింగిలో నిలిపేవాడు 
తన ఆశలను ముక్కలు చేసి నీ చుట్టూ చుక్కల్లా అలంకరించేవాడు  

నీ పాదభూషణాల సవ్వడిని
నీకు తెలియకుండ  తన యదసడిగా మార్చుకున్నవాడు 
నీ దారిలొ వెన్నెల వెలుతురుకై
నీకు తెలియకుండ  అమావస్య చీకటిలో నిలిచిపోయినవాడు 
అపురూపమైన పువ్వు నువ్వన్ని 
నీకు తెలియకుండ నీ చుట్టూ కటువైన కంచై నిలిచినవాడు 

జీవితాన్ని,కాలాన్ని,ప్రాణాన్ని తన సర్వస్వాన్ని 
అడగకుండానే అనుక్షణమైనా ఆలొచించకుండా నీకు అందించేవాడు 
నిన్ను నీకన్నా బాగా తెలిసినవాడు 
వాడొకడున్నాడని నీకు ఎప్పటికీ తెలియనివ్వనివాడు 
పాపం వాడు...!
వాడొకడున్నాడని వాడికే తెలియనివాడు..!
 మహర్షి

Sunday, April 6, 2014

చీకటి చుక్కలు

ఈ నెల "కౌముది"లో నా కవిత "చీకటి చుక్కలు" 

Monday, March 24, 2014

నేనో పిచ్చోడిని..

నేనో పిచ్చివాడిని 
పచ్చిగా నిక్కచ్చిగా నిజాన్ని కన్నందుకు,అన్నందుకు
శీలభంగమైన సంఘాన్ని దూషించి,ద్వేషించినందుకు
మనుషుల్లో మానవ కణాలు మాయమయ్యాయని 
గ్రహించి వాదించినందుకు 
జాతీయ గీతాన్ని రాప్ చేసి 
పబ్బుల్లో పాప్ చేయగల ప్రతిభావంతులున్నారని 
భగవద్గీతని రీమిక్స్ చేసి 
బెల్లీ డాన్స్ ఆడగల ఘనులున్నారని
పొరుగుదేశాల సంస్కృతిలో విచ్చలవిడి తనాన్ని మాత్రమె 
నేర్చుకుంటున్నారని 
బల్ల గుద్ది గీ పెట్టినందుకు 
నేను పిచ్చివదినే 
పరాయి దేశాలకు పారిపోవడమే 
లక్ష్యంగా,గౌరవంగా,హోదాగా,ప్రతిభగా
భావించే భావి పౌరుల్లో నేను లేనందుకు
నీటి తప్పిన దారుల్లో నడవలేక నిలబడిపోయినందుకు 
నమ్ముకున్న సిద్దాంతాలను,ఆత్మాభిమానాన్ని 
ఆర్బటాలకు అంగడిలో అమ్ముకోలేకపోయినందుకు 
ప్రాంతం,మతం,కులం,వర్ణం,జాతి భేదాలతో 
సాటి మనిషిని తుచ్చంగా,నీచంగా,హీనంగా చూడలేకపోతున్నందుకు 
ఈర్ష,ద్వేషాలతో పక్కవాడి మీద పగబట్టలేనందుకు 
మనిషిని ఇంకా మనిషిలాగే బ్రతుకుతున్నందుకు 
నిజంగానే నేను పిచ్చివాడిని 
మహర్షి

Friday, March 21, 2014

నేను లేను..

ఆరొజుల్ని తలుచుకుంటె నిస్పృహ కమ్మేస్తుంది 
ఎవరొ పదెపదె చెవిలొ నాకు మత్రమే 
వినిపించెలా అరుస్తునట్టు ఒకే పదం 
ప్రేమ,ప్రేమ,ప్రేమ 
అద్బుతమని,ఆశ్చర్యమని,తన్మయత్వమని ఎన్నొ విన్నాను
కాని ఎన్నడు అనుభూతి చెందలేదు 
నేను ఆ మాయలో ఆ మైకంలో తేలియాడలనుకున్నాను 
ఆ మధురానుభూతిని అనుభావించాలనుకున్నాను 

నా జీవితంలొకి వచ్చి ప్రతీ క్షణాన్ని అందంగా మార్చి
నన్ను నాకే కొత్తగా చూపించి,తనే నా ఊపిరిగా,నా ప్రపంచంగా మారె తనకై నిరీక్షించాను 

నా నిరీక్షనకు జవాబులా వచావు నువ్వు మెరుపులా  
నీ పసితనం,నీ చిలిపితనం,నీ నవ్వు,నీ కోపం,నీ అలక 
ఒక్కటేమిటి నీ ప్రతీ చర్య ఒక అద్బుతమైన అనుభూతిలా 
నా మదిని స్ప్రుసించింది 

ఆనందంతొ మొదలైన అద్బుత ప్రయాణం మెల్లిగా అభద్రతా,నిరాధరన,
నిరీక్షణ,వాదనల మలుపులు తిరుగుతూ అనుబందంలొని మాధుర్యం తగ్గిపొ సాగింది..
ఆకాశమంత నా ప్రేమో,అనువంత నీ అలక్ష్యమో, కారణాలు ఏవైన కావొచ్చు 
కాలం కదులుతూ కనిపించనంత దూరం చేసింది

ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావొ,ఏంచెస్తున్నావొ, కనీసం 
ఎలావున్నావో కూడా తెలియదు, ఏ క్షనంలొనైన నన్ను తలుస్తున్నావ, 
నేను గుర్తైనా  వున్నాన అని అడగాలనున్నా అడగలేను,అడగను 

నీ మీద ప్రేమ తగ్గొ లేద నేను సిలనై చలించడంలేదనొ కాదు.. 
నా తలపులు నీకు తెలియకుండ తలుపులేసను,నా మదిభవాలు బయటపడకుండ బందించెసాను

ఎందుకని అడిగితే , అనువంత నీ అలక్ష్యన్ని, ఆకాశమంత నా ప్రేమ జెయిస్తుందనుకున్నాను
అనంతమైన నా ప్రేమని అర్దం చేసుకుని నీ తీరు మార్చుకుంటావని ఆశ పడ్డాను..
ప్రతీసారి నిరాశే మిగిలింది.. నిజానికి నేనెప్పుడు నువ్వు మారాలనుకోలేదు. 
కేవలం నీపై నా చింతన,శ్రద్దని అర్దం చేసుకొవలనుకున్ననంతె

అభిమానించా,ఆరాధించా,ఆకాశమంత ప్రేమించా
అనుమానించావు,అవమానించావు,అనుక్షణం అలక్ష్యం చేసావు
కలగని అభిమానాన్ని కలిగించలేను,
అర్ధం చేసుకోలేని ఆరధానని వివరించలేను
అనుమతిలేనిది ప్రేమను హృదయం దోచుకోమనలేను
మనసుని ఆపలేను కాని మనిషిని ఆగిపోగాలను కదా.!

ఇక నీ ప్రపంచంలో నన్ను ఏమూలాన పడేసిన,అవతలికి విసిరేసిన,ఆకరికి నన్ను చెరిపేసిన నిన్ను నిలదీయను,నిందించను 

నీ ప్రపంచంలో నేను లేను...నా ప్రపంచమే నువ్వైనా వేల నన్ను నేను కోల్పోయా.. ఈ పపంచంలోను నేను లేను.. 
ఎక్కడా లేని నేను నిన్నెలా మరువగలేను..?
నా భవిష్యత్తుని తాకట్టు పెడితే 
సమయం ఒక సలహా విసిరింది 
జీవితాన్ని చక్కగా నటిస్తున్నావ్.. మరుపుని,సంతోషాన్ని నటించలేవ అని..! 
మహర్షి 

Monday, March 17, 2014

నా గ(మ)ది లో గబ్బిలాలు

మాపటి వేల ఎప్పటిలానే 
మేడ మీద నీడలో కూర్చున్నాను 
ఆకాశంలో ఆడి ఆడి అలిసిపోయి 
ఆవలి దిక్కులో వాలిపోయాడు సూరీడు
గాలి నిశ్శబ్దంగా వీస్తూ 
గుసగుసల వాసనలేవో మోసుకుపోతుంది 
ముందెప్పుడో స్పృశించినవే 
నిన్నటి వరకు ప్రతీ రోజు,ప్రతీ క్షణం
నన్ను వెంటాడినవే
కాదు కాదు 
నీడలా వెంటుంది నన్ను నడిపిస్తున్నవే
నీవో,నావో,మనవో..!
నీ మనవి లేనివి మానవని
మనసారా అనలేను
కాని 
మరువలేనివి,మధురమైనవి...
అదిగొ.. మళ్ళీ..!
అన్నీ మధురమైనవని మనసారా అనలేను
కన్నీటిలో తడిచి ఉప్పగా రుచిస్తాయి కొన్ని
అరక్షణంలోనే ఆకాశం రంగు మారింది 
చందమామ చుక్కల చీకటి చాప పరిచి
మబ్బుల మెత్తమీద వీపువాల్చి 
నా మనసు వింటున్నాడు 
అప్పటివరకు నా గుండె చీకటి గదుల్లో వేలాడుతున్న
జ్ఞాపకాల గబ్బిలాలు 
నీ తలపుల వెలుతురు తగలగానే 
నా నరనరాల దారుల్లో ఎగురుతూ 
నరకయాతన కలిగిస్తాయి 
నిన్ను చూస్తున్న తన్మయత్వంలో
ఆదమరచి కూర్చునప్పుడు
"ఓయ్" అన్న నీ పిలుపు 
ఇంకా నన్ను పలకరిస్తూనేవుంది 
ఆ పిలుపులో నాపై హక్కుని
నేటికీ నా బుజాల మీద మోస్తూనే ఉన్నాను
నా హాస్యాన్ని అపహాస్యం చేసి
నీ చిరునవ్వుని దాచేసి 
విసురుగా విసిరినా నీ చూపులు
ఇప్పటికీ నన్ను చూస్తూనే వున్నాయి
నా కారణంగా నీ ఆదరాలపై వికసించిన 
నవ్వు పూల పరిమళాలు ఇంకా నన్ను వీడనే లేదు 
గడిచిన కాలం తలపుల్లో గడిచే కాలం తెలియలేదు
ఊ కొట్టలేకో జో కొట్టినట్టనిపించో
గురకపెట్టి పడుకున్నాడు నెలరాజు 
అలసిపోయిన సూరీడు మళ్ళీ ఆటకేక్కాడని 
అప్పుడుకాని అర్ధం కాలేదు...
మహర్షి 

Wednesday, January 8, 2014

మనిషి

                      జంతువు నుండి రూపాంతరం చెందాదట మనిషి. అలా సాద్యపడటానికి కారణం మనిషి మస్తిష్కం అని శాస్త్రీయంగా ఎన్ని సాక్ష్యాలు వున్నా, కొట్టిపారేస్తూ మనసు అని నిక్కచ్చిగా చెప్పేవారూ ఏంతోమంది. శాత్రం,విజ్ఞానం ఎన్ని దొంగ సాక్ష్యలనైన పుట్టించగలదు కాని మనిషి మనస్సాక్షికి నిజం,నిజాయితీ వేరు వేరని తెలుసు తప్ప వాటికి వ్యతిరేకాలు ఉంటాయని తెలియదు పాపం. ఇంతకీ అసలు మనిషికి,జంతువుకు వున్న తేడా ఏమిటా.! అని అరా తీస్తే మనిషి మంచిని, చెడును తెలుసుకో గలడు మంచిని ఎంచుకో గలడు. జంతువుకు ఆ తేడాలు తెలియవు. జంతువు నుండి రూపాంతరం చెందిన మనిషి ఇంకా తన జంతు లక్షణాలను వదులుకోలేదు. ఒకసారి మన మనసును మనిషితోనూ మన మస్తిష్కాన్ని జంతువుతోను పోల్చుకుంటే, మనసు సామాజిక పర్యవసానాలను దృష్టిలో వుంచుకుని నిస్వార్దమైన నిర్ణయం తీసుకోగలదు. మన మస్తిష్కమైతే స్వర్దంగా తన గురించి మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది తరువాత పర్యవసానాలు ఏమైనా పట్టించుకోదు. గతం నుండి ప్రస్తుతానికి మన చరిత్రను గ్రహిస్తే స్వర్దానికి యుద్ధం చేసిన వారిని రాక్షసులుగాను నిస్వార్దంగా యుద్ధం చేసినవారిని వీరులుగాను,నాయకులుగాను చెప్పడం జరిగింది.
               రాతి యుగం నుండి నేటి యుగం వరకు మనిషి మనిషిలానే పుడుతున్నాడు కాని, పెరిగే క్రమంలోనే కొందరు మనుషులలా, కొందరు జంతువులలా మారుతున్నారు. మనిషి ప్రతీ చర్యకు రెండు దారులు వుంటాయి. ఒకటి మనసు చూపించేది మరొకటి మన మెదడు చూపించేది.మనసు దారిని ఎంచుకున్నవాడు మనిషిగా మిగులుతున్నాడు,మెదడు దారిని ఎంచుకున్నవాడు జంతువుగా మారుతున్నాడు. జంతువుగా మారుతున్న మనిషి తన మార్పును గ్రహించకపోవడం వింతగా అనిపించినా, అది మన మస్తిష్కం చేస్తున్న మోసం. మనిషిగా వున్న మనిషి ఒక నిర్ణయం తీసుకునే సమయంలో మన మనసుకు మన మస్తిష్కానికి మద్యన(మన అంతరంగంలో) యుద్ధం జరుగుతుంది.మనసు మనలోని బలంతో పోరాడితే,మస్తిష్కం మనలోని బలహీనతలను తన బలంగా చేసుకుని పోరాడుతుంది.ఈ యుద్ధం ప్రతీ నిర్ణయానికి ప్రతీ చర్యకు జరుగుతూనే వుంటుంది. మనసు ఎన్ని సార్లు గెలిచినా మస్తిష్కాన్ని చంపదు. కాని ఒక్కసారి మస్తిష్కం గెలిచిందో మనసును చంపేస్తుంది. అలాగే మనలోని మనిషిని కుడా..
మహర్షి 

Thursday, January 2, 2014

పదకంపం

సూరీడు పోద్దేక్కగానే నిద్ర లేచి
వెచ్చటి కిరణాలు సుతారంగా పోసుకుని
అద్దం ముందు సిద్దమయ్యాను
బుజానికి సంచి,సంచిలో పుస్తకాలు సర్దుకుని
సరాసరి నడుచుకుంటూ అచ్చరాల కూడలి చేరాను
అక్కడ నుండి అక్షరతూలికతో అడుగేయాలి
ఆలోచనల పురుగులు అంతటా పాకుతున్నాయి
అటుపక్క చెట్టు మీద పూసిన
ఆశలు కనిపించాయి
ఇటుపక్క తీగలకు వేలాడుతున్న
ఆరాటాలు కనిపించాయి
ఇంకోపక్క మనసు చెట్టుకు కాసిన జ్ఞాపకాలు
ఆకతాయి కాలం రువ్విన రాళ్ల గాయాలు అగుపించాయి
ఆశలకు ఆరాటాలకు మద్యలో సన్నని దారాలతో
ఊగిసలాడే ఊహలు
ఊహల విహంగాలు చిక్కుకుపోయిన ముళ్ళపొదలు
కాలంతో కదిలిపోలేక మోడువారి
విరిగిన హృదాయాల చిహ్నాలు
అడుగు అడుగుకో అనుభవం
మలుపు మలుపుకో తలపు
ఆలోచనల్లో అలిసిపోయి
అక్షరాల్లో వెలిసిపోయి
అచేతనంగా పడిపోయాను
పండిపోయిన పదాలన్ని కుప్పల్లా మీద రాలి పడ్డాయి
పదకంపమని భయపడి పరుగుతీసి పారిపోయాను
కాగితాల కారడవిలోకి..!
మహర్షి