Friday, May 27, 2016

ముగింపు

మొదలయ్యె ప్రతీ కథకి ఎక్కడొ ఒకచోట ముగింపు ఉంటుంది,
ఆనందంగానో,విచారంగానో,సంపూర్ణంగానో,అసంపూర్ణంగానో!
మహర్షి

సాద్యమేనా????

గదిలో ఒక్కడినే వున్నాను 
అనంత విశ్వంలో ఒంటరినైనా భావన
నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది....
జాబిలి లేని ఏకాంతరణ్యంలోకి విసిరివేయబడ్డాను 
అన్ని దిక్కులా అలిసిపోయేలా పరిగెత్తాను.... 
అంతకంతకు విస్తరించేంత శూన్యం
ప్రపంచంలొనే ఎవ్వరు లేనంత శూన్యంలా వుంది 
నా గది గోడల నుండి లీలగా నీ పేరు వినిపిస్తుంది 
ఓయ్ అని హక్కుగా నన్ను పిలిచే 
నీ పిలుపు సన్నగా ప్రతీవైపు నుండి ప్రతిద్వనిస్తుంది 
కదలకుండా కాసేపు ఏవైపు చూసినా 
నీ రూపు కనిపిస్తుంది
అయస్కాంతంలా నన్ను అమాంతంగా ఆకర్షించే
నీ  కళ్లు నావైపే చూస్తున్నాయి 
అటూ ఇటూ అందంగా కదులుతున్న నీ కల్లతో 
లయబద్దంగా నా ప్రాణం ఉయ్యాలూగుతుంది
ఇన్నాళ్ళు నా ఎదసడిగా వున్న నీ మువ్వలా చప్పుడు 
నన్ను వదిలి దూరంగా అడుగులేస్తుంది 
సడిలేని నా ఎద స్పందించేదెలా???? 
నీకు తెలియదా నీ ఉనికిలొనే 
నా ఊపిరి దాగి వుందని!!!
ఊపిరాడని దూరానికి నన్ను విసిరేస్తే ఎలా????
నా ప్రతీ ప్రాణాన్ని నిలుపుకుంది నీ కళ్ళలొనే  కదా
నీ చూపు నన్ను చేరనంటె ప్రాణం ఆగిపోదా....
నా నుండి నన్నే దూరం చేసి 
నీలా నన్ను మార్చేసి 
నేడు నీనుండి సైతం దూరంచేసి 
నిర్జీవంలా వదిలేసి 
బ్రతకమని నువ్వే బ్రతిమాలినా....
సాద్యమేనా???? 
మహర్షి

Tuesday, May 24, 2016

దూ..................రం...

చూస్తుండగానే నిన్ను చూడకుండా సంవత్సరం గడిచింది.
ప్రతీ గడియ ఎంత నిస్సారంగా,భరంగా గడిచిందొ!
నీవులేని అదునుచూసుకుని నీడలా 
నా వెనక తిరుగుతూ వెక్కిరిస్తున్న ఓంటరితనపు 
తుంటరి గాట్ల తీవ్రత నీకు తెలియదు.
నిన్ను చూడని నిమిషాలన్నీ నిశిలో కూరుకుపోయినవే....
అంతటి అంధకారంలో 
నా ఫోన్ స్క్రీన్‌లొ నిన్ను చూడగానే
వెన్నేల వెలుగంతా మినుగురులా మారి నన్ను పరవసింపచేస్తుంది, 
కాని పరుషమైన కాలం పరిగెడ్తూ పరిహసిస్తు 
నిన్ను చూడలేదన్న నిజాన్ని పదేపదే గుర్తుచేస్తూ 
ప్రతీ నిమిషాన్ని నిప్పులా మార్చి నన్ను దహిస్తుంది 
నీ అభావం నాపై చూపించే  ప్రభావం
నిజంగా! నీకు తెలియదు!
ఖాలి కాగితాలు 
వొలికిన సిరా 
పూర్తికాని కావ్యాలు

దహించే సమయం 
నరనరమున ప్రళయం  
లయతప్పిన హృదయం

ఎదురుచూసే నేను 
యదలొ నీవు 
యెడతెగని దూరం....
నిజంగా! నీకు తెలియదు!
నీ అభావం నాపై చూపించే  ప్రభావం
చలా ఘోరం,మోయలేనంత భారం
యెడతెగని దూ................రం....
మహర్షి 

Tuesday, May 3, 2016

కొత్త చివురు

రోజులు గడుస్తున్నాయని తెలుస్తుంది 
భరిస్తున్న బాధవల్ల 
మోస్తున్న భారం వల్ల 
కాని 
నువ్వు చెప్పేవరకు మరో 
కొత్త ఏడు వచ్చిందని తెలియనే లేదు
నిజానికి ఆ క్షణం వరకు 
నాకెదీ కొత్తగా లేదు 
ఆకాశానికి అంటిపెట్టుకున్న చిన్న 
నక్షత్రంలాంటి ఆశతో 
పాతబడ్డ అవే ఎదురుచూపులు 
దుమ్ముకొట్టుకుపోయి 
గాలికి రెపరెపలాడే
కాగితాలలొ రాసిన 
అవే పాత కావ్యాలు
నిరంతరం నా నీడను
నెమరేసే నాలుగు దిక్కుల 
అవే నాలుగు గోడలు
పదేపదే ప్రతీక్షణం తలిచే
అదే పేరు 
ఆ పేరుతొ పలికే 
అదే నువ్వు 
నీకై బ్రతికే
అదే నేను 
అన్నీ పాతబడినవే
కాని
నీ పిలుపు విన్న క్షణం 
వసంతంలో కొత్త చివురులా
నాతొపాటు నా ప్రపంచమంతా 
కొత్తగా ప్రాణం పోసుకుంది....
మహర్షి 

Thursday, April 14, 2016

దర్శనమీయవు!!!

ఆకాశంలో జాబిలి 
ఒక్కసారి నిన్ను చూడాలి 
దూరంగానో,దెగ్గరగానో!
కనీసం క్షణమో,అరక్షణమో !
నిన్ను చూడని నేను 
శిలనైపోతున్నాను,శిధిలమైపోతున్నాను  
యద బరువై ముక్కలైపోతున్నాను
రెక్కలు తెగిన పక్షినై 
నేలకు రాలిపోతున్నాను
నానుండి నేనే చీలిపోతున్నాను
కాష్టంలా కాలిపోతున్నాను 
నిజానికి అసలేమైపోతున్నానో తెలియదు 

వెలుతురు చూడని పగలు 
తీరం చూడని అలలు 
చుక్కలు చూడని చీకటి 
చిగురు చూడని వసంతం 
నిన్ను చూడని నేను!

పూయడం మర్చిపోయిన పూలచెట్టు
నాట్యం మరిచిన నెమలి 
రంగు వెలిసిన సీతాకోకచిలుక 
చిరునామాలేని ఉత్తరం 
దారం తెగిన గాలిపటం
నిన్ను చూడని నేను!
మహర్షి 

Wednesday, March 16, 2016

జీవితం వృత్తం

చాలా సార్లు చాలా విషయాలు చెప్పాలనుకుంటాను
కాని.. సరితూగే పదం దొరక్క ప్రాణయాతన!
అప్పుడప్పుడు దొరికే గుప్పెడు పదాలు
పసివాడు పట్టుకున్న వాన చినుకుల్లా 
మతిమరుపు దారలై జారిపోతుంటాయి 
జారిపోయిన వాటిలొ కొన్ని జాగ్రతగ్గా ఏరి 
జతచేసి జమచేసుకుంటాను
విలువైన కాలాన్ని విచ్చలవిడిగా వెచ్చించి
అచ్చంగా నాకు నచ్చేలా లిఖిస్తాను
ఆకర్లో అందంగా లేదని 
అసంపూర్ణంగా వుందని 
చించి చితిపేర్చి విసిరేస్తాను 
మళ్ళీ మొదటినుండి మరో ప్రయత్నం!!!! 
మహర్షి