Tuesday, May 3, 2016

కొత్త చివురు

రోజులు గడుస్తున్నాయని తెలుస్తుంది 
భరిస్తున్న బాధవల్ల 
మోస్తున్న భారం వల్ల 
కాని 
నువ్వు చెప్పేవరకు మరో 
కొత్త ఏడు వచ్చిందని తెలియనే లేదు
నిజానికి ఆ క్షణం వరకు 
నాకెదీ కొత్తగా లేదు 
ఆకాశానికి అంటిపెట్టుకున్న చిన్న 
నక్షత్రంలాంటి ఆశతో 
పాతబడ్డ అవే ఎదురుచూపులు 
దుమ్ముకొట్టుకుపోయి 
గాలికి రెపరెపలాడే
కాగితాలలొ రాసిన 
అవే పాత కావ్యాలు
నిరంతరం నా నీడను
నెమరేసే నాలుగు దిక్కుల 
అవే నాలుగు గోడలు
పదేపదే ప్రతీక్షణం తలిచే
అదే పేరు 
ఆ పేరుతొ పలికే 
అదే నువ్వు 
నీకై బ్రతికే
అదే నేను 
అన్నీ పాతబడినవే
కాని
నీ పిలుపు విన్న క్షణం 
వసంతంలో కొత్త చివురులా
నాతొపాటు నా ప్రపంచమంతా 
కొత్తగా ప్రాణం పోసుకుంది....
మహర్షి 

No comments: