మొదలయ్యె ప్రతీ కథకి ఎక్కడొ ఒకచోట ముగింపు ఉంటుంది,
ఆనందంగానో,విచారంగానో,సంపూర్ణంగానో,అసంపూర్ణంగానో!
మహర్షి
గదిలో ఒక్కడినే వున్నాను
అనంత విశ్వంలో ఒంటరినైనా భావన
నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది....
జాబిలి లేని ఏకాంతరణ్యంలోకి విసిరివేయబడ్డాను
అన్ని దిక్కులా అలిసిపోయేలా పరిగెత్తాను....
అంతకంతకు విస్తరించేంత శూన్యం
ప్రపంచంలొనే ఎవ్వరు లేనంత శూన్యంలా వుంది
నా గది గోడల నుండి లీలగా నీ పేరు వినిపిస్తుంది
ఓయ్ అని హక్కుగా నన్ను పిలిచే
నీ పిలుపు సన్నగా ప్రతీవైపు నుండి ప్రతిద్వనిస్తుంది
కదలకుండా కాసేపు ఏవైపు చూసినా
నీ రూపు కనిపిస్తుంది
అయస్కాంతంలా నన్ను అమాంతంగా ఆకర్షించే
నీ కళ్లు నావైపే చూస్తున్నాయి
అటూ ఇటూ అందంగా కదులుతున్న నీ కల్లతో
లయబద్దంగా నా ప్రాణం ఉయ్యాలూగుతుంది
ఇన్నాళ్ళు నా ఎదసడిగా వున్న నీ మువ్వలా చప్పుడు
నన్ను వదిలి దూరంగా అడుగులేస్తుంది
సడిలేని నా ఎద స్పందించేదెలా????
నీకు తెలియదా నీ ఉనికిలొనే
నా ఊపిరి దాగి వుందని!!!
ఊపిరాడని దూరానికి నన్ను విసిరేస్తే ఎలా????
నా ప్రతీ ప్రాణాన్ని నిలుపుకుంది నీ కళ్ళలొనే కదా
నీ చూపు నన్ను చేరనంటె ప్రాణం ఆగిపోదా....
నా నుండి నన్నే దూరం చేసి
నీలా నన్ను మార్చేసి
నేడు నీనుండి సైతం దూరంచేసి
నిర్జీవంలా వదిలేసి
బ్రతకమని నువ్వే బ్రతిమాలినా....
సాద్యమేనా????
మహర్షి
చూస్తుండగానే నిన్ను చూడకుండా సంవత్సరం గడిచింది.
ప్రతీ గడియ ఎంత నిస్సారంగా,భరంగా గడిచిందొ!
నీవులేని అదునుచూసుకుని నీడలా
నా వెనక తిరుగుతూ వెక్కిరిస్తున్న ఓంటరితనపు
తుంటరి గాట్ల తీవ్రత నీకు తెలియదు.
నిన్ను చూడని నిమిషాలన్నీ నిశిలో కూరుకుపోయినవే....
అంతటి అంధకారంలో
నా ఫోన్ స్క్రీన్‌లొ నిన్ను చూడగానే
వెన్నేల వెలుగంతా మినుగురులా మారి నన్ను పరవసింపచేస్తుంది,
కాని పరుషమైన కాలం పరిగెడ్తూ పరిహసిస్తు
నిన్ను చూడలేదన్న నిజాన్ని పదేపదే గుర్తుచేస్తూ
ప్రతీ నిమిషాన్ని నిప్పులా మార్చి నన్ను దహిస్తుంది
నీ అభావం నాపై చూపించే ప్రభావం
నిజంగా! నీకు తెలియదు!
ఖాలి కాగితాలు
వొలికిన సిరా
పూర్తికాని కావ్యాలు
దహించే సమయం
నరనరమున ప్రళయం
లయతప్పిన హృదయం
ఎదురుచూసే నేను
యదలొ నీవు
యెడతెగని దూరం....
నిజంగా! నీకు తెలియదు!
నీ అభావం నాపై చూపించే ప్రభావం
చలా ఘోరం,మోయలేనంత భారం
యెడతెగని దూ................రం....
మహర్షి
రోజులు గడుస్తున్నాయని తెలుస్తుంది
భరిస్తున్న బాధవల్ల
మోస్తున్న భారం వల్ల
కాని
నువ్వు చెప్పేవరకు మరో
కొత్త ఏడు వచ్చిందని తెలియనే లేదు
నిజానికి ఆ క్షణం వరకు
నాకెదీ కొత్తగా లేదు
ఆకాశానికి అంటిపెట్టుకున్న చిన్న
నక్షత్రంలాంటి ఆశతో
పాతబడ్డ అవే ఎదురుచూపులు
దుమ్ముకొట్టుకుపోయి
గాలికి రెపరెపలాడే
కాగితాలలొ రాసిన
అవే పాత కావ్యాలు
నిరంతరం నా నీడను
నెమరేసే నాలుగు దిక్కుల
అవే నాలుగు గోడలు
పదేపదే ప్రతీక్షణం తలిచే
అదే పేరు
ఆ పేరుతొ పలికే
అదే నువ్వు
నీకై బ్రతికే
అదే నేను
అన్నీ పాతబడినవే
కాని
నీ పిలుపు విన్న క్షణం
వసంతంలో కొత్త చివురులా
నాతొపాటు నా ప్రపంచమంతా
కొత్తగా ప్రాణం పోసుకుంది....
మహర్షి
ఆకాశంలో జాబిలి
ఒక్కసారి నిన్ను చూడాలి
దూరంగానో,దెగ్గరగానో!
కనీసం క్షణమో,అరక్షణమో !
నిన్ను చూడని నేను
శిలనైపోతున్నాను,శిధిలమైపోతున్నాను
యద బరువై ముక్కలైపోతున్నాను
రెక్కలు తెగిన పక్షినై
నేలకు రాలిపోతున్నాను
నానుండి నేనే చీలిపోతున్నాను
కాష్టంలా కాలిపోతున్నాను
నిజానికి అసలేమైపోతున్నానో తెలియదు
వెలుతురు చూడని పగలు
తీరం చూడని అలలు
చుక్కలు చూడని చీకటి
చిగురు చూడని వసంతం
నిన్ను చూడని నేను!
పూయడం మర్చిపోయిన పూలచెట్టు
నాట్యం మరిచిన నెమలి
రంగు వెలిసిన సీతాకోకచిలుక
చిరునామాలేని ఉత్తరం
దారం తెగిన గాలిపటం
నిన్ను చూడని నేను!
మహర్షి
చాలా సార్లు చాలా విషయాలు చెప్పాలనుకుంటాను
కాని.. సరితూగే పదం దొరక్క ప్రాణయాతన!
అప్పుడప్పుడు దొరికే గుప్పెడు పదాలు
పసివాడు పట్టుకున్న వాన చినుకుల్లా
మతిమరుపు దారలై జారిపోతుంటాయి
జారిపోయిన వాటిలొ కొన్ని జాగ్రతగ్గా ఏరి
జతచేసి జమచేసుకుంటాను
విలువైన కాలాన్ని విచ్చలవిడిగా వెచ్చించి
అచ్చంగా నాకు నచ్చేలా లిఖిస్తాను
ఆకర్లో అందంగా లేదని
అసంపూర్ణంగా వుందని
చించి చితిపేర్చి విసిరేస్తాను
మళ్ళీ మొదటినుండి మరో ప్రయత్నం!!!!
మహర్షి
పగటిని చితిపేర్చి రాత్రిని ఆజ్యం చేసి
నన్ను దినమంతా దహిస్తున్నావు
దగ్ధమవుతున్న బాధను
దూరమనే భయం హేలన చేస్తుంది
కరాల గరళాన్ని నీవే అందిస్తున్నావు
అమృతంలా అందుకోవడంతప్ప వద్దనగలనా
నా యదసడిని రణభేరిగా మార్చేసావు
నా ప్రతీ శ్వాసని సైనికుడ్ని చేసి
నాతొనే యుద్దం చేయిస్తున్నావు
బ్రతుకు చక్రాల సీల ఊడదీసి
ఉరకమని నన్ను ఉసిగొల్పుతున్నావు
ఊ అని నువ్వంటె
ఊపిరే వదలగలను
ఉరకడమా!!!!
గండ దీపంలాంటి
గుండెలోని ఆయువు
ఏనిమిషంలో ఏకొండలెక్కిపోతుందో
పోనీ పోనీ పొతేపోనీ
అని వదిలేయగలను కాని
నిన్ను వీడలేని నా ఆశలు
ఆఖరి ఆయువై ఆపేస్తున్నాయి...
మహర్షి
గదిలొ ఎవరులేరు
నాలుగు గోడల నాలుగు దిక్కుల
నాలుక చీలిన నాగుల నిదమై
నల్లని నిశ్శబ్దం
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
సెగలు సెగలు పొగలు పొగలు
తెరలు తెరలు మెరవని మినుగురులై
సురభీకరించు భీకర మృతసౌరభము
ఎవరులేరు గదిలొ...
గదిలొ ఎవరులేరు
యేటవాలుబల్ల మీద
నిట్టనిలువ నిలబడిన
అనేక అశ్రువులతొ
అనేక అలేఖ పుస్తకాలు
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
అతుకుల చితుకుల చీలికలు
రెపరెపలాడిన రంగుల రెక్కలు
మనసుని పోలిన కాగితాలు
ఎవరులేరు గదిలొ...
గదిలొ ఎవరులేరు
తీరని ఆశల ఆరిన దీపం
విరిగిన హృదయం ఎవ్వరి శాపం
కాల్చె కాలం కటంకటకూపం
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
ఉండాల్సిన ఒక్కడూ
పగిలిన గుండె బరువై
రెండు కండ్లు చెరువై
ఆశకు ఆయువు కరువై
బొందిలొ బందీని విదులచేసి
గదిని గతంలొ వదిలేసి
జాబిలి పక్కన తారగ మారగ
మరొక్కసారి మరొక్క ప్రయత్నమని
మరుజన్మకు మరణించి వెల్లిపోయాడు
ఎవరులేరు గదిలొ...
మహర్షి
సముద్రంలో అలలు
నా యదలో నీ అలొచనలు
అంకెలకు సరిపోవు
సంకెలై బందిస్తావు
కాలంతో నన్నో
నాతో కాలాన్నో
ఆశలకు నా ఆయువు పోసి
దాచుకుంటాను
ఉరి తీసినట్టు వేలాడదీస్తావు
కాని ఊపిరాడుతూనే వుంటుంది
గడుస్తున్న ప్రతీ క్షణం గండంలాగే
విడుస్తున్న ప్రతీ శ్వాస ఆకరిదే
ఇప్పుడు అప్పుడు అని కాదు
ఎప్పుడూ నా తలపుల్లొనే వుంటావు
ప్రాణాన్ని పట్టి మెలేస్తావు
కాని నా ప్రాణమే నీవనిపిస్తావు
నా ప్రతిబింబాన్ని నాకే ప్రతికూలంగా మార్చేస్తావు
పరిహాసంగా నా ఉనికినే ప్రశ్నార్దకం చేస్తావు
ఏప్రణాళిక లేకుండానే యదలొ
ప్రళయాన్ని సృష్టిస్తావు
"ఏంటో!
నాకు అర్దమే కాదు" అని
అమాయకంగా నన్నే అడిగి
తెరుపు మరుపులొ నన్నొదిలేసి జారుకుంటావు....
మహర్షి
నీ భావోధ్వెగాల గోడల మాటున దాక్కుంటావు
నిజాన్ని నిశ్శబ్దంలో ఖైదు చేస్తావు
కాని
నువ్వు చేప్పని చాలా విషయాలు
నీ మౌనంలో నాకు వినిపించేస్తుంటాయి
మనమద్యన నువ్వు నిర్మించిన ఈ దూరం
కరిగిపోయే కాలం తప్ప మరేమీ కాదు
నీ భావాలు దాచే రహస్యచోటు తప్ప మరేమీ కాదు
అయినా ఆచోటు నుండి నీ ప్రేమను వినగలను
నీకై చేసే నిరీక్షణలో
నా సహనానికి పరిమితి లేదు
చీకటి చేరశాల నువ్వు దాచిన ప్రేమను విడుదల చేసేవరకు
నా జీవితకాలాన్ని,నా మరణాన్ని సైతం వెచ్చిస్తాను
ప్రపంచాన్ని శూన్యంచేసి
ఒక్కసారి నీ యదసడిని అడుగు
మన ఆత్మబంధం అర్దమవుతుంది....
అప్పటికి నీకు అర్దమవ్వకపోతె
చెప్పాను కదా! నా సహనానికి పరిమితి లేదని...
మహర్షి
నీ ఉనికి లేకపోతే
కునుకు లేని పిశాచిని
వెలుగు లేని నిశాచిని
చలనం లేని జీవాన్ని
నీ ఉనికి లేకపోతే
గాత్రం లేని గీతాన్ని
జ్ఞాపకం లేని గతాన్ని
ప్రాణమున్న ప్రేతాన్ని
నీ ఉనికి లేకపోతే
సలిలం లేని సంద్రాన్ని
చినుకు లేని యెడారిని
బద్దలైన గోళాన్ని
ముక్కలైన గగనాన్ని
విరుచుకుపడ్డ ప్రళయాన్ని
తెగిపడ్డ నక్షత్రాన్ని
విరిగిపడ్డ విహంగాన్ని
తగలబడ్డ అరణ్యాన్ని
బ్రతకలేని భారాన్ని
వ్యర్దమైన భవాన్ని
చిద్రమైన ఆశని
పగిలివున్న హృదయాన్ని
మిగిలివున్న శిధిలాన్ని....
మహర్షి
భాషకు సరిపడని
భవోద్వెగాలకు గురిచేస్తుంటావు
బావుంటుంది,
బాధగాను వుంటుంది
భయం,దైర్యం,
ఆనందం,దుఃఖం,
శాంతం,కోపం,
ఇష్టం,అసూయ,
అన్నింటిని ఒకే క్షణంలో
పరిచయం చేస్తావు
అసలేమి అర్దమే కాదు
బరువైపోతుంది గుండె
కరువైపోతాయి మాటలు
పరాయి భాషల్లోంచి
అరువుతెచ్చుకున్నా సరిపోవు
బిగిసిన పిడికిలంత హృదయంలో
బ్రహ్మాండాన్ని మించిన ప్రేమను
భధ్రంగా భరిస్తున్నాను
ఒక క్షణం పగిలినట్టు
మరో క్షణం రగిలినట్టు
నరకంలా అనిపిస్తుంది
స్వర్గంలా కనిపిస్తుంది
నన్ను నీలో బంధించావొ
నిన్ను నా యదలోకి సంధించావో
ఏమొ ఏంచేసావో
గడియ గడియకి జన్మిస్తున్నాను
మరో గడియకే మరణిస్తున్నాను
నీవల్లే జీవిస్తున్నా....
నీవల్లె మరణిస్తున్నా...
నీకొసమే మరణిస్తున్నా....
నీకొసమే జీవిస్తున్నా...
ఇక
నువ్వే నా జీవితమని వెరే చెప్పాలా!!!
మహర్షి
అమ్మ కడుపునుండి ఆయువు పొసుకోవడం
అస్సలు తెలియలేదు
కాని
కొన్ని క్షణాల క్రితమే
ఆ అనుభూతి తెలిసింది
తనువు అనువు అనువున
కణం కదలిక తెలిసింది
ప్రతీ నెత్తుటి చుక్కలో
వేడిమి తెలిసింది
హృదయం చేసే సవ్వడికి
శ్వస చేసే నాట్యనికి
మద్యన అనుబంధమే జీవితమని
ఇప్పుడె తెలిసొచ్చింది
పుట్టి పాతికేళ్ళ పైనే అయినా
ఇప్పుడే ప్రాణం పోసుకున్న అనుభూతి
అద్బుతంగా వుంది
మరొ సారి నన్ను పుట్టించిన నీకు
కాలాలకు అతీతంగా,జనన,మరణాలకు అతీతంగా
నన్ను అంకితమిస్తున్నాను శాశ్వతంగా....
మహర్షి
నిన్న రాతిరి వాలిన పొద్దు
మరో ఉదయాన్ని సిద్దం చేస్తుంది
నా హృదయాన్ని కూడ
వెచ్చని కిరణంలాంటి నీ తలపులతో
నీకై స్పందించటం
నీ ఆలోచనల్లొ బందించటం
స్పందించటం,
బందించటం,
స్మరించటం,
భరించటం,
జీవించటం,
మరణించటం,
విసిగించటం,
ప్రేమించటం,
ప్రతీ వాక్యం,ప్రతీ పదం,ప్రతీ అక్షరం
పాతబడిపోయింది
కొత్తగా ఏదొ చెప్పాలి,
మునుపు చెప్పిన పాత విషయమె
కాని ఎలా చెప్పాలి????
ఎలా చెప్పాలా???
లేదా!
ఎందుకు చెప్పాలా????
ఇది సందేహమా,ప్రశ్న???
ఏది సందేహం
ఏది ప్రశ్న
అపరిమితమైన సందేహాల,ప్రశ్నల
గొలుసు నా చుట్టూ అల్లుకుంటుంది
సందేహాల నివృత్తి నీడల పరిగెత్తలా????
సమాధానాల గోడలు పడగొట్టాలా???
ఇలాగే
ప్రతీ రోజు తికమకల,మకతికల మరొరోజె
ఈ అస్తవ్యస్త వ్యూహాల చిక్కుకు చచ్చే అభిమన్యుడినే
నా గమ్యమై నన్ను నువ్వు పిలిచేవరకు....
నా గమనమై నడిపించేవరకు...
మహర్షి
పట్టపగటి కల నన్ను భయపెట్టింది
నాగంలా బుస కొట్టింది
దయ్యంలా పగబట్టింది
అంధవిశ్వాసాలను అవహేలన చేసే
నా నాస్తికత్వాన్నే అవహేలన చేసింది
నా బలహీనతను బలంగా చేసుకుంది
వెన్నులో దడపుట్టించింది
నాది అన్న హక్కుని లాగేసింది
నా పక్కటెముకలు విరిచి
నా గుండెను దూరంగా విసిరేసింది....
ఊపిరాగిపోయింది
ఉలిక్కిపడి లేచాను
ఊపిరి ఆడుతుంది
కాని.. కాని..
భయం నా ఊపిరిలో
ఇంకా ఊపిరి తీసుకుంటునేవుంది
మనసు అభద్రతలో అస్తిరమైంది
అపశృతిలో అలాపిస్తిస్తుంది హృదయం
నా బలం ఉనికి తెలుసుకోవాలి
నా బలహీనతను భద్రంగా కాచుకోవాలి
నా బలం,బలహీనత
రెండూ ఒక్కటె....
గాలికి రెపరెపలాడుతున్న
ప్రాణాన్ని నీవైపు వదిలిపెట్టాను
నీదే భరోసా....
మహర్షి
మెరుపులా నువ్వు కనిపించిన క్షణం
సందేహాల చినుకులు నామీద కురుస్తాయి
నిజంగానే ఉన్నవా లేదా నా ఊహా???
ఎలా ఉన్నవ్,తిన్నవా,నిమిషం క్రితం నన్నేమైనా అన్నావా????
మాట్లాడాలనుకుంటున్నవా,నేనే మాట్లాడించాలనుకుంటున్నవా???
ఇంకా ఎన్నో ప్రశ్నలు
క్షేమంగా ఉన్నావా,
కాలిగా ఉన్నావా,
ఒకసారి మాట్లాడగలవా,
మౌనం మరీ ప్రియమైపోయిందా????
మైళ్ళదూరానికి మాటలు కరువా???
మాటవరుసకైనా మనిషిని గుర్తున్నానా?
ఇంకా ఎన్నో ఎన్నేన్నో
కాని
చిరునామా లేని ఉత్తరాలు ఎన్ని రాసినా!!!!
బదులురాని ప్రశ్నలు ఎన్ని వేసినా!!!
శూన్యంలో చిక్కుకుపోయిన నా చూపుల మాదిరి
అందుకే అన్నింటికి
నాకు నేనే బదులిచ్చుకుంటాను
మౌనంగా....
మహర్షి
గడియారానికి కళ్ళను ముల్లు చేసి
గడుపుతుంటాను
నీ తలపుల గంతలు కట్టేసి
క్షణంలో ఘంటలు దాటేస్తావు
నాకు తెలిసిన పదాలన్ని కూడబెట్టుకుంటాను
నన్ను అదిమేస్తున్న నీ ఆలోచనల బరువు తూచేందుకు
అసమతుల్యత నా పదాలను అకాశానికి విసిరేస్తుంది
నా అక్షరాల ఆస్తినంతటిని ఆనకట్టగా అల్లుతాను
నన్ను ముంచే నీ అన్వీక్షనల ప్రవాహాన్ని పట్టి వుంచేందుకు
పీడనంచేత నా అక్షరాలు అల్లకళ్ళొలమైపోతాయి
గెలుపులేని ప్రయత్నాలు ఎన్ని చేసానో!!!!
అలుపులేని ఓటములు ఏన్ని చూశానో!!!
లెక్కవేయలేదు....లెక్కచేయలేదు...
నాకు గెలుపులేదు
నా ఆశకు అలుపులేదు
నా ఎదురుచూపుకు నీ పిలుపులేదు
అంతులేని సంద్రం
నా హృదయం
అలుపులేని అలలు
నీ అలోచనలు
ఎగిసి ఎగిసి యదను కోస్తున్నాయి
కోసికోసి ముక్కలు చేస్తున్నాయి
లెక్కవేయలేదు....లెక్కచేయలేదు...
నిరీక్షణ నా గమనం
నువ్వు నా గమ్యం
మహర్షి
నా యదసంద్రంలో దాగిన
అక్షరాల ముత్యాలన్ని కోరికోరి ఏరి
అందంగా అలంకరించి
మధురంగా మాటలల్లుకుంటాను
అల్లుకున్న మాటలన్నిటికి నా ఆయువు పోసి
ఆశల రెక్కలు తొడిగి నీవైపు ఎగరేస్తాను
గొంతు వాకిలి దాక వచ్చిన మాటలన్ని....
నువ్వు ఎదురుపడగానె
నిన్ను చూసిన ఆనందానికో,ఆశ్చర్యానికో,మరెందుకో
మౌనంగా నిశ్శబ్దంలోకి రాలిపోతాయి...
వేల క్షణాలు వేచున్నాను
కొన్ని క్షణాలు జీవించేందుకు
కాని కాలం స్థితిస్థాపకమైనది....
ఎన్ని మాటలు కూడబెట్టుకున్నానో
మనసారా మాటాడేందుకు
కాని మౌనానికున్న స్వేచ్ఛ
మాటలకెక్కడిది...
మహర్షి
అనుకుని కలిసిందొ
అనుకొకుండా కలిసిందో
ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి
ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన
నా జాడ తెలిసొచ్చిందో!!!???
నాకు పొద్దులేదు
నా ఆశకు హద్దు లేదు
అలలు ఆకాశన్ని తాకవు
వెన్నెల నేల మీద కురవదు
వెన్నెల కురిసే చోట నేలుంటుంది కదా....
మహర్షి
కసిగా నిశి కమ్మేసింది
నా గదినంతా....
నువ్వెమో నా మదినంతా...
నిరాకారమైన నిశ్శబ్దం
నిశి చాటునుండి
నన్ను జయించింది
అనుక్షణం నిన్ను తలవటం.
ఆకరిగా నిశ్శబ్దానికి ఓడటం....
నిట్టూరుస్తూ బ్రతకటం...
మహర్షి