పగటిని చితిపేర్చి రాత్రిని ఆజ్యం చేసి
నన్ను దినమంతా దహిస్తున్నావు
దగ్ధమవుతున్న బాధను
దూరమనే భయం హేలన చేస్తుంది
కరాల గరళాన్ని నీవే అందిస్తున్నావు
అమృతంలా అందుకోవడంతప్ప వద్దనగలనా
నా యదసడిని రణభేరిగా మార్చేసావు
నా ప్రతీ శ్వాసని సైనికుడ్ని చేసి
నాతొనే యుద్దం చేయిస్తున్నావు
బ్రతుకు చక్రాల సీల ఊడదీసి
ఉరకమని నన్ను ఉసిగొల్పుతున్నావు
ఊ అని నువ్వంటె
ఊపిరే వదలగలను
ఉరకడమా!!!!
గండ దీపంలాంటి
గుండెలోని ఆయువు
ఏనిమిషంలో ఏకొండలెక్కిపోతుందో
పోనీ పోనీ పొతేపోనీ
అని వదిలేయగలను కాని
నిన్ను వీడలేని నా ఆశలు
ఆఖరి ఆయువై ఆపేస్తున్నాయి...
మహర్షి
గదిలొ ఎవరులేరు
నాలుగు గోడల నాలుగు దిక్కుల
నాలుక చీలిన నాగుల నిదమై
నల్లని నిశ్శబ్దం
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
సెగలు సెగలు పొగలు పొగలు
తెరలు తెరలు మెరవని మినుగురులై
సురభీకరించు భీకర మృతసౌరభము
ఎవరులేరు గదిలొ...
గదిలొ ఎవరులేరు
యేటవాలుబల్ల మీద
నిట్టనిలువ నిలబడిన
అనేక అశ్రువులతొ
అనేక అలేఖ పుస్తకాలు
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
అతుకుల చితుకుల చీలికలు
రెపరెపలాడిన రంగుల రెక్కలు
మనసుని పోలిన కాగితాలు
ఎవరులేరు గదిలొ...
గదిలొ ఎవరులేరు
తీరని ఆశల ఆరిన దీపం
విరిగిన హృదయం ఎవ్వరి శాపం
కాల్చె కాలం కటంకటకూపం
ఎవరులేరు గదిలొ....
గదిలొ ఎవరులేరు
ఉండాల్సిన ఒక్కడూ
పగిలిన గుండె బరువై
రెండు కండ్లు చెరువై
ఆశకు ఆయువు కరువై
బొందిలొ బందీని విదులచేసి
గదిని గతంలొ వదిలేసి
జాబిలి పక్కన తారగ మారగ
మరొక్కసారి మరొక్క ప్రయత్నమని
మరుజన్మకు మరణించి వెల్లిపోయాడు
ఎవరులేరు గదిలొ...
మహర్షి
సముద్రంలో అలలు
నా యదలో నీ అలొచనలు
అంకెలకు సరిపోవు
సంకెలై బందిస్తావు
కాలంతో నన్నో
నాతో కాలాన్నో
ఆశలకు నా ఆయువు పోసి
దాచుకుంటాను
ఉరి తీసినట్టు వేలాడదీస్తావు
కాని ఊపిరాడుతూనే వుంటుంది
గడుస్తున్న ప్రతీ క్షణం గండంలాగే
విడుస్తున్న ప్రతీ శ్వాస ఆకరిదే
ఇప్పుడు అప్పుడు అని కాదు
ఎప్పుడూ నా తలపుల్లొనే వుంటావు
ప్రాణాన్ని పట్టి మెలేస్తావు
కాని నా ప్రాణమే నీవనిపిస్తావు
నా ప్రతిబింబాన్ని నాకే ప్రతికూలంగా మార్చేస్తావు
పరిహాసంగా నా ఉనికినే ప్రశ్నార్దకం చేస్తావు
ఏప్రణాళిక లేకుండానే యదలొ
ప్రళయాన్ని సృష్టిస్తావు
"ఏంటో!
నాకు అర్దమే కాదు" అని
అమాయకంగా నన్నే అడిగి
తెరుపు మరుపులొ నన్నొదిలేసి జారుకుంటావు....
మహర్షి
నీ భావోధ్వెగాల గోడల మాటున దాక్కుంటావు
నిజాన్ని నిశ్శబ్దంలో ఖైదు చేస్తావు
కాని
నువ్వు చేప్పని చాలా విషయాలు
నీ మౌనంలో నాకు వినిపించేస్తుంటాయి
మనమద్యన నువ్వు నిర్మించిన ఈ దూరం
కరిగిపోయే కాలం తప్ప మరేమీ కాదు
నీ భావాలు దాచే రహస్యచోటు తప్ప మరేమీ కాదు
అయినా ఆచోటు నుండి నీ ప్రేమను వినగలను
నీకై చేసే నిరీక్షణలో
నా సహనానికి పరిమితి లేదు
చీకటి చేరశాల నువ్వు దాచిన ప్రేమను విడుదల చేసేవరకు
నా జీవితకాలాన్ని,నా మరణాన్ని సైతం వెచ్చిస్తాను
ప్రపంచాన్ని శూన్యంచేసి
ఒక్కసారి నీ యదసడిని అడుగు
మన ఆత్మబంధం అర్దమవుతుంది....
అప్పటికి నీకు అర్దమవ్వకపోతె
చెప్పాను కదా! నా సహనానికి పరిమితి లేదని...
మహర్షి
నీ ఉనికి లేకపోతే
కునుకు లేని పిశాచిని
వెలుగు లేని నిశాచిని
చలనం లేని జీవాన్ని
నీ ఉనికి లేకపోతే
గాత్రం లేని గీతాన్ని
జ్ఞాపకం లేని గతాన్ని
ప్రాణమున్న ప్రేతాన్ని
నీ ఉనికి లేకపోతే
సలిలం లేని సంద్రాన్ని
చినుకు లేని యెడారిని
బద్దలైన గోళాన్ని
ముక్కలైన గగనాన్ని
విరుచుకుపడ్డ ప్రళయాన్ని
తెగిపడ్డ నక్షత్రాన్ని
విరిగిపడ్డ విహంగాన్ని
తగలబడ్డ అరణ్యాన్ని
బ్రతకలేని భారాన్ని
వ్యర్దమైన భవాన్ని
చిద్రమైన ఆశని
పగిలివున్న హృదయాన్ని
మిగిలివున్న శిధిలాన్ని....
మహర్షి
భాషకు సరిపడని
భవోద్వెగాలకు గురిచేస్తుంటావు
బావుంటుంది,
బాధగాను వుంటుంది
భయం,దైర్యం,
ఆనందం,దుఃఖం,
శాంతం,కోపం,
ఇష్టం,అసూయ,
అన్నింటిని ఒకే క్షణంలో
పరిచయం చేస్తావు
అసలేమి అర్దమే కాదు
బరువైపోతుంది గుండె
కరువైపోతాయి మాటలు
పరాయి భాషల్లోంచి
అరువుతెచ్చుకున్నా సరిపోవు
బిగిసిన పిడికిలంత హృదయంలో
బ్రహ్మాండాన్ని మించిన ప్రేమను
భధ్రంగా భరిస్తున్నాను
ఒక క్షణం పగిలినట్టు
మరో క్షణం రగిలినట్టు
నరకంలా అనిపిస్తుంది
స్వర్గంలా కనిపిస్తుంది
నన్ను నీలో బంధించావొ
నిన్ను నా యదలోకి సంధించావో
ఏమొ ఏంచేసావో
గడియ గడియకి జన్మిస్తున్నాను
మరో గడియకే మరణిస్తున్నాను
నీవల్లే జీవిస్తున్నా....
నీవల్లె మరణిస్తున్నా...
నీకొసమే మరణిస్తున్నా....
నీకొసమే జీవిస్తున్నా...
ఇక
నువ్వే నా జీవితమని వెరే చెప్పాలా!!!
మహర్షి
అమ్మ కడుపునుండి ఆయువు పొసుకోవడం
అస్సలు తెలియలేదు
కాని
కొన్ని క్షణాల క్రితమే
ఆ అనుభూతి తెలిసింది
తనువు అనువు అనువున
కణం కదలిక తెలిసింది
ప్రతీ నెత్తుటి చుక్కలో
వేడిమి తెలిసింది
హృదయం చేసే సవ్వడికి
శ్వస చేసే నాట్యనికి
మద్యన అనుబంధమే జీవితమని
ఇప్పుడె తెలిసొచ్చింది
పుట్టి పాతికేళ్ళ పైనే అయినా
ఇప్పుడే ప్రాణం పోసుకున్న అనుభూతి
అద్బుతంగా వుంది
మరొ సారి నన్ను పుట్టించిన నీకు
కాలాలకు అతీతంగా,జనన,మరణాలకు అతీతంగా
నన్ను అంకితమిస్తున్నాను శాశ్వతంగా....
మహర్షి
నిన్న రాతిరి వాలిన పొద్దు
మరో ఉదయాన్ని సిద్దం చేస్తుంది
నా హృదయాన్ని కూడ
వెచ్చని కిరణంలాంటి నీ తలపులతో
నీకై స్పందించటం
నీ ఆలోచనల్లొ బందించటం
స్పందించటం,
బందించటం,
స్మరించటం,
భరించటం,
జీవించటం,
మరణించటం,
విసిగించటం,
ప్రేమించటం,
ప్రతీ వాక్యం,ప్రతీ పదం,ప్రతీ అక్షరం
పాతబడిపోయింది
కొత్తగా ఏదొ చెప్పాలి,
మునుపు చెప్పిన పాత విషయమె
కాని ఎలా చెప్పాలి????
ఎలా చెప్పాలా???
లేదా!
ఎందుకు చెప్పాలా????
ఇది సందేహమా,ప్రశ్న???
ఏది సందేహం
ఏది ప్రశ్న
అపరిమితమైన సందేహాల,ప్రశ్నల
గొలుసు నా చుట్టూ అల్లుకుంటుంది
సందేహాల నివృత్తి నీడల పరిగెత్తలా????
సమాధానాల గోడలు పడగొట్టాలా???
ఇలాగే
ప్రతీ రోజు తికమకల,మకతికల మరొరోజె
ఈ అస్తవ్యస్త వ్యూహాల చిక్కుకు చచ్చే అభిమన్యుడినే
నా గమ్యమై నన్ను నువ్వు పిలిచేవరకు....
నా గమనమై నడిపించేవరకు...
మహర్షి
పట్టపగటి కల నన్ను భయపెట్టింది
నాగంలా బుస కొట్టింది
దయ్యంలా పగబట్టింది
అంధవిశ్వాసాలను అవహేలన చేసే
నా నాస్తికత్వాన్నే అవహేలన చేసింది
నా బలహీనతను బలంగా చేసుకుంది
వెన్నులో దడపుట్టించింది
నాది అన్న హక్కుని లాగేసింది
నా పక్కటెముకలు విరిచి
నా గుండెను దూరంగా విసిరేసింది....
ఊపిరాగిపోయింది
ఉలిక్కిపడి లేచాను
ఊపిరి ఆడుతుంది
కాని.. కాని..
భయం నా ఊపిరిలో
ఇంకా ఊపిరి తీసుకుంటునేవుంది
మనసు అభద్రతలో అస్తిరమైంది
అపశృతిలో అలాపిస్తిస్తుంది హృదయం
నా బలం ఉనికి తెలుసుకోవాలి
నా బలహీనతను భద్రంగా కాచుకోవాలి
నా బలం,బలహీనత
రెండూ ఒక్కటె....
గాలికి రెపరెపలాడుతున్న
ప్రాణాన్ని నీవైపు వదిలిపెట్టాను
నీదే భరోసా....
మహర్షి
మెరుపులా నువ్వు కనిపించిన క్షణం
సందేహాల చినుకులు నామీద కురుస్తాయి
నిజంగానే ఉన్నవా లేదా నా ఊహా???
ఎలా ఉన్నవ్,తిన్నవా,నిమిషం క్రితం నన్నేమైనా అన్నావా????
మాట్లాడాలనుకుంటున్నవా,నేనే మాట్లాడించాలనుకుంటున్నవా???
ఇంకా ఎన్నో ప్రశ్నలు
క్షేమంగా ఉన్నావా,
కాలిగా ఉన్నావా,
ఒకసారి మాట్లాడగలవా,
మౌనం మరీ ప్రియమైపోయిందా????
మైళ్ళదూరానికి మాటలు కరువా???
మాటవరుసకైనా మనిషిని గుర్తున్నానా?
ఇంకా ఎన్నో ఎన్నేన్నో
కాని
చిరునామా లేని ఉత్తరాలు ఎన్ని రాసినా!!!!
బదులురాని ప్రశ్నలు ఎన్ని వేసినా!!!
శూన్యంలో చిక్కుకుపోయిన నా చూపుల మాదిరి
అందుకే అన్నింటికి
నాకు నేనే బదులిచ్చుకుంటాను
మౌనంగా....
మహర్షి
గడియారానికి కళ్ళను ముల్లు చేసి
గడుపుతుంటాను
నీ తలపుల గంతలు కట్టేసి
క్షణంలో ఘంటలు దాటేస్తావు
నాకు తెలిసిన పదాలన్ని కూడబెట్టుకుంటాను
నన్ను అదిమేస్తున్న నీ ఆలోచనల బరువు తూచేందుకు
అసమతుల్యత నా పదాలను అకాశానికి విసిరేస్తుంది
నా అక్షరాల ఆస్తినంతటిని ఆనకట్టగా అల్లుతాను
నన్ను ముంచే నీ అన్వీక్షనల ప్రవాహాన్ని పట్టి వుంచేందుకు
పీడనంచేత నా అక్షరాలు అల్లకళ్ళొలమైపోతాయి
గెలుపులేని ప్రయత్నాలు ఎన్ని చేసానో!!!!
అలుపులేని ఓటములు ఏన్ని చూశానో!!!
లెక్కవేయలేదు....లెక్కచేయలేదు...
నాకు గెలుపులేదు
నా ఆశకు అలుపులేదు
నా ఎదురుచూపుకు నీ పిలుపులేదు
అంతులేని సంద్రం
నా హృదయం
అలుపులేని అలలు
నీ అలోచనలు
ఎగిసి ఎగిసి యదను కోస్తున్నాయి
కోసికోసి ముక్కలు చేస్తున్నాయి
లెక్కవేయలేదు....లెక్కచేయలేదు...
నిరీక్షణ నా గమనం
నువ్వు నా గమ్యం
మహర్షి
నా యదసంద్రంలో దాగిన
అక్షరాల ముత్యాలన్ని కోరికోరి ఏరి
అందంగా అలంకరించి
మధురంగా మాటలల్లుకుంటాను
అల్లుకున్న మాటలన్నిటికి నా ఆయువు పోసి
ఆశల రెక్కలు తొడిగి నీవైపు ఎగరేస్తాను
గొంతు వాకిలి దాక వచ్చిన మాటలన్ని....
నువ్వు ఎదురుపడగానె
నిన్ను చూసిన ఆనందానికో,ఆశ్చర్యానికో,మరెందుకో
మౌనంగా నిశ్శబ్దంలోకి రాలిపోతాయి...
వేల క్షణాలు వేచున్నాను
కొన్ని క్షణాలు జీవించేందుకు
కాని కాలం స్థితిస్థాపకమైనది....
ఎన్ని మాటలు కూడబెట్టుకున్నానో
మనసారా మాటాడేందుకు
కాని మౌనానికున్న స్వేచ్ఛ
మాటలకెక్కడిది...
మహర్షి
అనుకుని కలిసిందొ
అనుకొకుండా కలిసిందో
ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి
ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన
నా జాడ తెలిసొచ్చిందో!!!???
నాకు పొద్దులేదు
నా ఆశకు హద్దు లేదు
అలలు ఆకాశన్ని తాకవు
వెన్నెల నేల మీద కురవదు
వెన్నెల కురిసే చోట నేలుంటుంది కదా....
మహర్షి
కసిగా నిశి కమ్మేసింది
నా గదినంతా....
నువ్వెమో నా మదినంతా...
నిరాకారమైన నిశ్శబ్దం
నిశి చాటునుండి
నన్ను జయించింది
అనుక్షణం నిన్ను తలవటం.
ఆకరిగా నిశ్శబ్దానికి ఓడటం....
నిట్టూరుస్తూ బ్రతకటం...
మహర్షి
ఇన్నాళ్లు నీ యడబాటు బరువుకు
నేల మీదె నిలిచిపోయాను
రెక్కలున్నాయని మర్చిపోయి
మల్లీ ఇప్పుడే ఎగరడం మొదలెట్టాను
ఎంత బలహీనుడిని చేస్తావొ
అంతకు మించిన బలాన్ని ఇస్తావు
అదే బలంతో భయం లేకుండ ఎగురుతున్నాను
ఆకాశాన్ని దాటిన ఎత్తులో
ఈ రెక్కలిలాగె ఉండనివ్వు
స్వేచ్చగా నన్నిలా ఎగరనివ్వు...
మహర్షి
ఎన్ని వేల క్షణాలు చిగురించెనో!
నిన్ను తలచి తలచి....
ఎన్ని వేల క్షణాలు రాలిపోయెనో!
నిన్నే తలచి తలచి...
సన్నని చిరునవ్వు వెనకాల
మసక మసకగా....
ఇసుకరవ్వంత బెంగ
నిన్ను తలచి తలచి...
మహర్షి
చచ్చి బ్రతకడం అదృష్టం చూపించింది
బ్రతికి చావడం కాలం చూపించింది
చస్తూ బ్రతకడం మాత్రం నువ్వె చూపిస్తున్నావు
చస్తున్నానని భాద లేదు
బ్రతుకుతున్నానని ఆనందమూలేదు!
ఆశ ఒక్కటె కారణం
ఇంక నా ఆయువు ఆరిపోకుండ
నా గుండె ఆగిపోకుండ కొట్టుకుంటోంది
ఉదయం నుండి వేచివున్న హృదయం
నిన్ను చూసేదాక
లేదా నీ మాటవినేదాక
స్పందించనని మొండికేసింది
చేసేదేమి లేక
నేను శిలనై
నీ రాకకోసం ఎదురుచూస్తున్నాను....
విసిరేయకలా.... ముక్కలై విరిగిపొయేలా
నెట్టేయకలా.... అగాదంలో పడిపోయేలా
వదిలేయకలా.... చిట్టడవిలో చిక్కుకుపోయేలా
వెలేయకలా....నన్ను నేనే కోల్పోయేలా
వెలుగుతుంది, ఆరిపొతుంది, వెలుగుతుంది, ఆరిపొతుంది
ఒక్క పచ్చటి దీపం
వెలిగిన క్షణం నా ఎదుట
ఆరిన క్షణం నా ఎదలో
నువ్వు అందర్ బాహర్ ఆడుకుంటున్నావనిపిస్తుంది.... నాతొ!!!
లక్షల నక్షత్రాలు నా మీద కురిసాయా
వెన్నులొ రెక్కలు మొలిచి
ఆకశానికి వేగంగా నన్నెత్తుకెల్లాయా
నాటి మర్చిపోయిన విత్తనం
చిగురించి చిట్టడవైందా
యెడారిలొ ఏకదాటిగా
ఏడేల్లు వర్షం కురిసిందా
నీవల్లె ఈ అంతులేని ఆనందం!!!
నా ఆనందమా....
మహర్షి
అవునను లేదా కాదను
కాని ఏదోటి అను
మౌనంగా మసి చేయకు
మాటలు లేని ఏడారిలో
మరోసారి వదిలేయకు....
తప్పంతా నాదె
కాని తప్పక చేసినదే
తల్లిలా మన్నించు
మెల్లగా దండించు
కోపం తగ్గకపోతె
కన్నులతో కాల్చేయి
అంతేకాని
అలక్ష్యంగా వదిలేయకు
నిశ్శబ్ద సముద్రంలొ
విసిరేయకు
ఊపిరాడక ఊగిసలాడుతాను
నీ అడుగుకు అందెను నేను
లయగా నన్ను పలకరించు
నా మదికి సవ్వడి నువ్వు
అప్పుడొఇప్పుడొ సడివై రావూ
ఏదోటి అను
వదిలేయకు
విసిరేయకు
మౌనంగా శూన్యంలోకి...
మహర్షి
ఇక నీకు చెప్పేదేమి లేదు
మాటలైతే చెప్పొచ్చు
మనసు మాటలు కాదుకదా!!!
అరచెయ్యంత మనసులో
ఆకాశమంత ప్రేముందని
అదారమెలా చూపించను
అణువంత ప్రేమకే అనుమతిలేనిది
గదితలుపులు మూసుకుని
ఇక గాలివీయదనుకుంటె
కంటి రెప్పలు మూసుకుని
వెలుగు విరియదనుకుంటె
గొడుగు చాటు నిలుచుని
వర్షమే కురవదనుకుంటె
గాలి,వెలుగు,వర్షం
తీరు మారిపోదుగా
ప్రేమైనా అంతే
అనుమతివ్వనంతన
ఆగిపోదు,ఆరిపోదు
ఆవిరైపోదు ప్రేమ
నువ్వు చూడటంలేవని
నిన్ను వెతకటం మానదు నా చూపు
నువ్వు మౌనంగా ఉన్నావని
నిన్ను స్మరించడం మానదు నా మనసు
అలక్ష్యంగా చూస్తున్నావని
ఆగిపోను,అలిసిపోదు
నేను, నా ప్రేమ....
మహర్షి
అకాలంలొ కురిసే వర్షంలాగె
ఆనందం కుడా కురుస్తుంది
సన్నగా మొదలై జడిగా మారుతుంది....
ఎండిపోయిన ఆకుల్ని వర్షం
నా మనసుని ఆనందం
ప్రవాహం లొ మోసుకెల్లిపోతుంది...
ఎటొ తెలియని గమ్యం వైపుకు!!!!
చిన్న చిన్న తరంగాలుగా
కొన్ని అనుభూతుల చుట్టూ
తిప్పుకుంటూ
మద్యమద్యలొ తేలికపాటి చిరునవ్వు
గడ్డిపోచల్లా సుతారంగ తగులుతాయి
అంతుచిక్కని సందేహమొకటి ఆవిర్బవిస్తుంది
ఈ ఆనందం లాంటి ఆకాశం
ఆకాశమంత ఆనందం
అకస్మాత్తుగా వచ్చినదా????
లేద
తన తలపులు నన్ను తడపాలని
తానే పంపించినదా???
నివృత్తి చేసుకోవాలన్న ఆసక్తిలేదు
అనుభూతిని పక్కన పెట్టి
ఆనందానికి ఆదారాలు
సంతొషానికి సాక్ష్యాలు
వెతకటం మూర్ఖత్వం కదా...
అచలనంగా వున్న నా చుట్టూ ప్రపంచం
ఒక్కొక్కటిగా ప్రాణం పోసుకుంటుంది
నన్ను కూడా కలుపుకుని
నాలుగు గోడల నా గది
నాతో మాట్లాడుతుంది
కాగితాలలో లిఖించి
కాపాడుకుంటున్న నీ కబుర్లన్నీ
రెపరెపల చప్పుడ్లతో
మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది
సంతోషం సముద్రమై
కెరటాల మీద పడవలా
నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది...
మహర్షి
నీ తలపుల కిరాణాలు నన్ను
తాకితేనే
నా ఉదయం మొదలు
వెన్నెలవై.... చీకటైన నన్ను
వెలిగిస్తేనే...
నా రాత్రికి అంతం
ప్రతీ క్షణాన్ని నీ పేరుతో
లెక్కిస్తేనే
నా రోజుకు రుజువు
నా హృదయానికి స్పందన
నువ్వు,నువ్వు,నువ్వంటూ
నిన్ను విసికిస్తున్ననా
నిజమే
నన్నేం చేయమంటావు
నన్ను నేనెపుడొ కొల్పోయాను
నాకు నేను లేను
వెతికినా దొరకను....
నువ్వె నా ఉనికికి
జీవం,ఆదారం,సాక్ష్యం
నన్నేం చేయమంటావు
శిధిలం అవ్వమంటావా????
శూన్యం అవ్వమంటావా???
అందుకూ నేను సిద్దమే....
ఆనందంగా...
మహర్షి
ఆకాశాన్నంతా ఆలిగనం చేసుకోవాలన్న
ఆశతో
అంతకు మించిన ప్రేమతో
అలుపులేక ఎగురుతున్న విహంగాన్ని
నేను..
నన్ను వెక్కిరిస్తూ వెర్రితనానికి
వెరీ కాంపిటెంట్ అని
కాంప్లిమెంట్ ఇచ్చిన కాలం నోటికి
తాళం వేసి
కూసే కాకుల మేసే మేకల
ఇల్లిబరల్ లోకాన్ని ఇగ్నోర్ ఇట్
అని నిషబ్దంగా చిత్కారించి
ఒకవైపు ప్రేమని,మరోవైపు ఆశని
నా బలిమై....
ఆకరివరకు అనిరోధనీయంగా ఎగురుతాను
నా చెలిమికై...
మహర్షి
కొన్ని లక్షల క్షణాల ఎదురుచూపుకు చివరన
చిన్న ఆశ చిగురిస్తుంది.... ఆయువు అంతంత మాత్రంగ...
నీ ప్రమేయం లేకుండానే తుంచేస్తావు... బలవంతంగ
నేను గాలిపటమని తెలుసు
నిన్ను చేరలనే ఎగురుతున్నానని తెలుసు
నేలవైపు నిర్ధాక్షిణ్యంగా నెట్టేస్తావు
ఏ కొమ్మల్లొ ఒరిగిపోతానో????
ఏ ముల్లపొదల్లొ చిరిగిపొతానో???
ఒకే క్షణంలొ రెండు గుండె చప్పుడ్లు వినిపిస్తాయి
బ్రతికుండలన్న ఆశ.... బ్రతకలేనేమొ అన్న భయం....
అదృష్టమొ దురదృష్టమొ... నా జీవితాన్ని నిర్దేషించే వరకు
నన్ను మొత్తంగా నీ వశమవ్వనివ్వు
నేనంటు వున్నానని నన్ను నమ్మనివ్వు
నాకు ప్రాణం వుందని కాస్త ఊపిరినివ్వు
నా జీవితాన్నిచ్చేయమని నేనడగట్లేదు
కనీసం జీవశ్చవంలా జీవించేందుకు
ఆదారం ఇవ్వమంటున్నాను
కష్టమంటావా????
సరె నీ ఇష్టమే నా ఇష్టమంటాను...
మహర్షి
నా గదినొక నిదిగా
నా మదినొక గదిగా
నా గదిలొ
నా మదిలొ
నువ్వొక నిదిలా
గా నేను శిధిలం
గా అయ్యెదాక పదిలం
గా ఆనందం
గా నా ఆనందాన్ని
దాచుకుంటాను
కంటికి రెప్పలా
కాచుకుంటాను
చంటిపాపలా
చూసుకుంటాను
నా గదినొక నిదిగా
నా మదినొక గదిగా
నా గదిలొ
నా మదిలొ
దాచుకుంటాను
కాచుకుంటాను....
చూసుకుంటాను...
మహర్షి
వేసవి వేడిమికి మండిపోతున్న మధ్యాహ్నవేల
మార్గం మరిచి వచ్చిన మేఘమొకటీ
మధురంగా మనసు తాకి వెళ్ళింది
వచ్చిన వర్షానిది కాదు పొరపాటు
వర్షానికి వరండాలో కూర్చోవడం నా అలవాటు
కొన్ని నేల మీద పడ్డ చినుకులు
చిన్నపిల్లలై చింది
తుంపర్లుగా నన్ను తడుపుతున్నాయి
వాస్తవానికి
నన్ను కాదు చాటుగా నా మనసును
కురుస్తున్న ప్రతీ చినుకు తోడుగా
నీ చిరునవ్వుల్ని మోసుకొస్తున్నాయి
నీ చిరునవ్వు చినుకులు నన్ను తాకగానే
పువ్వులై పూస్తు నీ పరిమళాన్ని
మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తున్నాయి
వర్షం అలిసిపోయి వెలిసిపోయింది
నీ ఆలోచనలు కురుస్తూనే వున్నాయి
నా మనసుని తడుపుతూనే వున్నాయి
చూస్తు చూస్తు నా మనసు
మైమరచి మయూరమై మారిపోయింది
మహర్షి
నిన్ను చూసే ప్రతీక్షణం
మొదటిసారే
ప్రతీ మొదటిసారి
తెలియని పాతపరిచయపు
పరిమళమే
గుర్తులేని జ్ఞాపకమో....
జ్ఞాపకం లేని గుర్తువో...
నా మామూలు మదిసడి
మరుపురాని మధుర గానమై
మళ్ళీ వినేలోపు మౌన రాగమై
నా తలపును మీటుతూంటుంది
మరొసారి పాత పారిచయపు
కొత్త మొదటి క్షణం కోసం.
మహర్షి
కొన్ని సార్లు మాటలు సరిపోవు
కొన్ని చాలా సార్లు
అక్షరాలు అరువు తెచ్చుకున్నా
అసంపూర్ణంగానే మిగులుతాయి
అసలు విషయం
అంతరంగం దాటి రాదు
మనసులోని మాటలన్నీ
నీటి మీద నీటి రాతలైపొతాయి
కొత్త ఆకుల నుండి పడిన
పల్చటి పసిడి కాంతిలాంటి
ఒక నవ్వు అకారణంగా చిగురిస్తుంది
నా లోపలి నుండి ఏవరో
నా మదిని తట్టిన చప్పుడు
నేను రాయని మాటలెవరో
నా చెవిలో సన్నగా చెప్పారు
నా తెలివికి తెలియని భాషని
నా కళ్లు సరళంగా పాటలా చదువుతున్నాయి
నన్ను జయించిన నా మనసు
నా మనసులోని నీకై
మాటల పరిధి దాటి
మౌనంగా ఓ కవిత లిఖించింది
నీ మనసు ముందుంచింది
ఏమీ తెలియనట్టు....
నా వెనకాల నక్కి ఎదురుచూస్తుంది...
మహర్షి
జీవం లేనిది వస్తువు
జీవం ఉన్నది ప్రాణి
నా హృదయంలోకి నువ్వు నడుచుకుంటు
వచ్చెదాక
నేనేమిటొ అర్దమయ్యెది కాదు నాకు
వస్తువుకు నాకు మద్యున్న తేడా
కదలికే
అదే జీవితమనుకున్నాను
జీవస్చవానని తెలియక
హృదయమొకటి ఉందని
స్పందన దానికుందని
నిన్ను చుసిన క్షణమే తెలిసింది
గాలికి దూలికి తేడా తెలియదు
నువ్వు వరమై
వర్షమై వచ్చేవరకు
నిన్నటి కంబళిపురుగుకు రేపటి ఆశ లేదు
నువ్వొచ్చెదాక
రంగుల రెక్కలిచ్చేదాక
హద్దు లేని సంద్రాన్ని నేను
తీరమై
నువ్వొచ్చి కట్టిపడేసేదాక
నేనున్నానని నాకు తెలియదు
ప్రాణమై
నువొచ్చి పలకరించేదాక
నిజానికి నేనెప్పుడో పుట్టినా
నీ పరిచయంతోనే ప్రాణం పోసుకున్నానన్నది
నిజంగా నిజం....
మహర్షి
కొన్ని క్షణాలుంటాయి
ఆకాశంలొనే వున్నా అస్తమానం కనిపించని
నక్షత్రాల్ల
పాతబడవు ప్రకాశం తగ్గవు
ఎంత పెళ్ళగించినా ఎక్కడొ ఒక
వేరు మిగిలి
మళ్ళీ చివురించిన ఆకుపచ్చని ఆశలా
ఎప్పటికి వాడవు ఎన్నటికి వీడవు
అలాంటి కొన్ని క్షణాల రాళ్లు
నా మది నదిలో విసిరిన
కారణంగా విరిసిన
నీ ఆలోచనల తరంగాలు
దొంతర్లుగా నన్ను తడుతూ నెడుతునేవున్నాయి
వ్యక్తపరచలేని కొన్ని మాటలు
మనసు నుండి రాలి తేలిపోతుంటాయి
నీ కంటి రెపరెపల నుండి
వీచిన అల్లితెమ్మెరలకు
గుల్మొహర్ పువ్వులలా గిరికీలు కొడుతూ
కొన్ని కలలు కురిసాయి.... మెలకువలొనే...
మహర్షి
నిశ్శబ్దానికి పరాకాష్టైన నిశిలొ
నిక్షిప్తమైన కొన్ని వెన్నెల సుమాలు
సుతారంగ నా మీద రాలిపడ్డాయి
లీలగ వాటి పరిమళం నా గుండెలోపలి
పొరల్లొ తెరలుకట్టుకుంది
ముల్లులేని గడియారాల గడియల్లొ
గోముగా గోరువెచ్చని గుసగుసలు వినిపించాయి
మాటలు రాని నా ఆశల పాపలు
నీకు పాటలై ఎలా వినిపించాయొ????
కంటి రెప్పల చాటున దాచిన
భావోద్వేగాల పోరాటాలు
ఆవిరైపోయె నా అరాటాలు
అద్దంలా ఎలా కనిపించాయొ???
దాదాపుగా ఆగిపోయిన గుండెని
ఓయ్ అని నీ పిలుపుల కొక్కానికి
నా గుండెను తగిలించుకుని
నన్ను,నా గుండెను లాక్కెల్లిపొయావు
మళ్ళీ జీవితంవైపు....
మహర్షి
సీకటి సిటుక్కు మనగానే
మబ్బుల పక్కపొంటి
మొద్దులెక్క నిద్రపొయ్యిన సురీడు
పొద్దుపొద్దుగాలనె పొడిసిండు
గాల్ల గుండ్రని దీపంలెక్క
దీపం కొసమీద కొయిసని కొరయితోటి
సుర్రున సుర్కవెట్టి నన్నుగిట్ల లేపిండు
పన్లేని మంగలొడు పిల్లి తల కొర్గినట్టు
పడమర తొవ్వపొంటి పడిపోయెటొడు
నల్ల తుమ్మ చెట్ల మీద పూసిన
తెల్ల పువ్వుల్ని దులిపిండు
కోపమొచ్చి పువ్వులు కొంగలై ఎగిరిపొయినై
అప్పటిదాక నా కంటి కిటికీల మీద
కూసున్న నిద్ర గద్దలు కూడ
జింక లెక్క ఉర్కుతున్న కాలాన్ని
పట్టుకోవాలని పరుగులెడ్తున్న జంతువులు
కాదు కాదు జనాలు
ఆకలేసి కొందరు,ఆశతోని కొందరు
ఆమాటకొస్తె
నేనుగిట్ల ఆ మందల ఉన్నోడినే
ఉర్కి ఉరికి దస్సినోడిని
ఎన్నిసార్ల యెల్లెల్కల పడ్డనో
పడి లేస్న.. లేసి పడ్డ
ఆగకుండ ఉర్కిన.. ఉర్కలేక ఆగిన
నేనాగిన చొట అడుగులు
అటుదిక్కు ఇటుదిక్కు
ఎటుదిక్కు చూసినా
అడుగులు
ఎన్కొచ్చిన దారంత
ముందుపోవాల్సిన దూరమంత
నావిగాదా అడుగులు
నా అడుగులేడ ఆగమైనయో
ఏడచూసిన మడుగులు
అడుగులు నిండిన మడుగులు
నా పుర్రెల పురుగులు పారినట్టైంది
అవి పురుగులు కావు
నన్ను సవాల్ చేస్తున్న సందేహాలు
నన్ను బేచైన్ బేచైన్ చేస్తున్నై
ఇగ నేను పోవాలె కొత్త దారి లెంకుకుంట
లేకపోతె కట్టుకుంటా
సవాల్లకు సమాధానాలు దొరికేదాక....
మహర్షి
నేనెవరొ నీకు తెలుసన్నావ్
నీకు తెలుస నేనెవరొ?
నిజంగా నీకే నేను తెలిస్తె
నేడిలా నేనో
అగంతకునిల,అనామకునిల,అపరిచితునిల నీకు తెలియకుండ
నిన్ను చూసేవాడ్ని కాదు,
నీ గొంతు వినేవాడ్ని కాదు
నా చీకటి గదిలొ
చుట్టూ కాగితల చితిపేర్చుకునేవాడ్ని కాదు
క్షణాన్ని,అరక్షణాన్ని లెక్కేస్తు బ్రతుకునీడ్చెవాడ్ని కాదు
కన్నీళ్ళను దాచుకుంటు కాలంతొపాటు కదిలి
కాలిపొయేవాడ్ని కాదు
నడి రాత్రులలొ నిశాచరుడినై చుక్కలు లెక్కేస్తు జాబిలికై
వెర్రివాడ్నై వేచుండెవాడ్ని కాదు
స్వప్నానికి,సత్యానికి నడిమద్యన
ఊగిసలడెవాడ్ని కాదు
నాకు నేనుగ నా గుండెను విసిరిపడెసెవాడ్ని కాదు
విశాల ప్రపంచంలొ వెలేసిన స్మశానంలా
అనంతమైన చీకటిని సైతం వెక్కిరించె శూన్యంలా
మారిపొయేవాడ్ని కాదు
నిజంగ నీకే నేను తెలిస్తె
నేడిల నాకు నేనే తెలియని
ఈ స్థితిలొ ఉండేవాడ్నే కాదు.!!!
మహర్షి
లేసి లెవ్వంగనె పాణంలేని పక్షుల
రెక్కలు కొట్టుకుంటాయి
రాత్రి నా తలకాయల పొదిగిన గుడ్ల్లన్నీ
తలకాయల్లేని గొర్రెంకలై పొడుస్తాయి
ఏడికొ ఎగరాలని
ఇంకేడికొ ఉరకాలని
ఏడ యాదిమర్స్తనొ అని
దినమంత కిసకిసమని
గోసొలె కూస్తనే వుంటాయి
పాణంలేని పక్షులు
ఈకల్లేని రెక్కలు
తోకల్లేని మేకల
మె మె లకు మొండికెక్కి
పద పదమంట
నా పాణం మీద కూసున్నాయి
కాళిక లెక్క నాలిక
శాచిన సీకటి తాచు
ఉస్స్స్స్ ఉస్స్స్స్ మన్న సప్పుడుకి
ఉసూరుమని నా
ఊపిరితిత్తుల అరుగులెక్కి
అరుసుకుంట కూసుంటాయి
దించలేని బరువుకు
దమ్మాడక మొద్దువారిన
మనసుని పొద్దువైపు తోసుకుంట
నడిమిట్ల ఏడ ఆగకుంట
ఇగ అట్ల పొతనే.....వుంట..
మహర్షి